కలం, వెబ్ డెస్క్ : అమరావతిలో(Amaravati) నేడు సాయంత్రం 5 గంటలకు జనసేన (Janasena) పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, ఇటీవల చోటుచేసుకుంటున్న కీలక అంశాలపై పవన్ కల్యాణ్ నేతలతో విస్తృతంగా చర్చించనున్నారు.
అలాగే పార్టీ నిర్మాణం, సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే అంశాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. సమావేశంలో తీసుకునే నిర్ణయాలు, పార్టీ భవిష్యత్ వ్యూహంపై ఆసక్తి నెలకొంది.

