కలం, నకిరేకల్: కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై బీఆర్ఎస్ నాయకుడు హరీశ్ రావు చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో శాస్త్రీయంగా, ప్రాక్టికల్ విధానంలో వాస్తవాలను వివరించారని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేముల వీరేశం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాలేశ్వరం ఒక మాయ ప్రాజెక్టు అని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన చోట భూమిలోనే లోపం ఉందని, నిర్మాణంలో ఎలాంటి నాణ్యత లేదని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ స్పష్టం చేసిందని వీరేశం గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం పిల్లర్లు కూలిపోతే, అప్పట్లోనే వాటికి ఎందుకు మరమ్మతులు చేయించలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా దీనిపై చర్చిద్దాం రమ్మంటే.. బీఆర్ఎస్ నాయకులు ఎందుకు పారిపోతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
హరీశ్ రావు పనికిరారనే పక్కనబెట్టారు..
“ఇరిగేషన్ మంత్రిగా హరీశ్ రావు పనికిరారనే ఉద్దేశంతోనే అప్పట్లో కేసీఆర్ ఆయన్ను పక్కనబెట్టారు. ఇప్పుడు హరీశ్ రావు మాట్లాడేవన్నీ అబద్ధాలే. ఆయన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో సైతం అనేక లోపాలు ఉన్నాయి. అంతా డొంకతిరుగుడు మాటలే తప్ప అందులో నిజం లేదు” అని వీరేశం మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నష్టానికి అసలు నేరస్థుడు కేసీఆరా? లేక హరీశ్ రావా? అనేది వారు తేల్చి చెప్పాలని.. కేసీఆర్, కేటీఆర్‌లకు రెస్ట్ ఇచ్చి, బీఆర్ఎస్ పార్టీ పూర్తి బాధ్యతలను హరీశ్ రావు తన భుజాలకెత్తుకున్నాక మాట్లాడితే బాగుంటుందన్నారు.
ప్రాజెక్టు వెనక బీఆర్ఎస్ కమిషన్ల కక్కుర్తి..
రూ. 11,670 కోట్లు ఖర్చు చేసిన తర్వాత ప్రాజెక్టును సడన్‌గా ఆపడం వెనుక బీఆర్ఎస్ నేతల కమిషన్ల కక్కుర్తి దాగి ఉందని వీరేశం ఆరోపించారు. తాము 158 మీటర్ల కోసం మాట్లాడితే, బీఆర్ఎస్ మాత్రం కమిషన్ల కోసం ఆశపడి 120 మీటర్లకే పరిమితమైందని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో దీనిపై చర్చలు జరిగాయని స్పష్టం చేశారు. మల్లన్నసాగర్‌ను అత్యంత తప్పుడు పద్ధతిలో నిర్మించారని, దీనివల్ల భవిష్యత్తులో కరీంనగర్ జిల్లాకు పెద్ద ముప్పు పొంచి ఉందన్నారు.
జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ డ్రామా..
తెలంగాణ రాష్ట్రం మొత్తం వాడేంత విద్యుత్‌ను ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లకే వినియోగించాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టుకు సంవిధాన్ నిర్మాత అంబేద్కర్ పేరు ఉండటాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకనే రీ-డిజైన్ల డ్రామా ఆడిందని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో గడీల పాలనను బద్దలు కొట్టి ప్రజలకు నిజమైన ‘ప్రజా పాలన’ అందిస్తున్నారని, తెలంగాణను ముంచినందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత, నాయకులు పూజర్ల శంభయ్య, చామల శ్రీనివాస్, పన్నాల రాఘవరెడ్డి, నకిరేకల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదగోని కొండయ్య, టౌన్ ప్రెసిడెంట్ లింగాల వెంకన్న, కేతేపల్లి మండల అధ్యక్షులు ఎడ్ల ప్రవీణ్ కుమార్, మాజీ కౌన్సిలర్ గాజుల సుకన్య, నాయకులు చౌవుగోని శ్రీనివాస్, యాసారపు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

