కలం, యాదగిరిగుట్ట: అంగన్వాడీ కేంద్రాల ద్వారా మరింత సేవలు (Anganwadi Services) అందేలా పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్ ఛాంబర్ లో మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అంగన్వాడీ సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టు వారీగా సీడీపీఓలు, సూపర్వైజర్లు సమయపాలన పాటిస్తూ అంగన్వాడీ కేంద్రాలను క్రమం తప్పకుండా సందర్శించాలని ఆదేశించారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించాల్సిన అన్ని సేవలు అర్హులైన లబ్ధిదారులకు వంద శాతం చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రీస్కూల్ పిల్లలు సర్వే ప్రకారం ప్రతిరోజూ కేంద్రాలకు హాజరయ్యేలా తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని, అంగన్వాడీ కార్యకలాపాల్లో పారదర్శకతను పాటించాలని తెలిపారు. పోషణ ట్రాకర్, ఎన్‌హెచ్‌టీఎస్ యాప్‌ల్లో లబ్ధిదారుల వివరాలు ఒకే విధంగా నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని, ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులను ఎంపీడీఓలు, తహసీల్దార్లతో సమన్వయం చేసుకుని వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సీడీపీఓలు, సూపర్వైజర్లు తమ నెలవారీ టూర్ డైరీలను ప్రతి నెల జిల్లా కార్యాలయానికి తప్పనిసరిగా పంపించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి శ్రీనివాస్, సీడీపీఓలు వెంకటరమణ, శైలజ, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, సూపర్‌వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు.

