కలం, వెబ్ డెస్క్ : విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల (Missing Fishermen) ఉదంతం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గత కొన్ని రోజులుగా ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ సంయుక్తంగా నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. మంగళవారం అర్ధరాత్రి 12 వరకు అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ.. గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభించలేదు. దీంతో సెర్చ్ ఆపరేషన్‌ను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
అయితే నిన్న సాయంత్రమే గాలింపు చర్యలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ అనంతరం మత్స్యకార కుటుంబాల విజ్ఞప్తి మేరకు రాత్రి 12 వరకు సెర్చ్ ఆపరేషన్‌ను అధికారులు పొడిగించారు. ఇప్పుడు ఫైనల్ గా గాలింపు చర్యలు నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. అధికారులు గాలింపు చర్యలు ముగిసినట్లు ప్రకటించడంతో మత్స్యకార కుటుంబాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతోంది. తమ వారు క్షేమంగా తిరిగి వస్తారని ఎదరు చూసిన గంగపుత్రుల కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి.
అసలేం జరిగింది?
జూలై 1న విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు వల్ల సముద్రంలో బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. అయితే మిగిలిన ఆరుగురు మత్స్యకారులు సముద్ర గర్భంలో గల్లంతయ్యారు.
రూ. 10 లక్షల తక్షణ ఆర్థిక సాయం: మంత్రి
ఈ ఘోర ప్రమాదంపై కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించింది. మత్స్యకార కుటుంబాల దీనస్థితిపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. గల్లంతైన ఒక్కో మత్స్యకారుడి కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున తక్షణ ఆర్థిక సహాయం అందించాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు.

