కలం డెస్క్ : కాంగ్రెస్ పార్టీలో పవర్ పాలిటిక్స్ మొదలయ్యాయా?.. రాహుల్‌గాంధీ వర్సెస్ ప్రియాంకాగాంధీ ఇష్యూ తెరపైకి ఎందుకు వచ్చింది?.. నాయకత్వ (Congress Leadership) బాధ్యతల అప్పగింతపై రెండు రకాల అభిప్రాయాలకు కారణమేంటి?.. వారిద్దరి మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకపోయినా నేతలు బహిరంగంగా ఎందుకు నోరు విప్పుతున్నారు?.. ఇది కేవలం పార్టీ నాయకత్వ బాధ్యతలకు మాత్రమే పరిమితం కాకుండా భావి ప్రధానిగా ఎవరుండాలనే టాపిక్‌గా ఎందుకు మారుతున్నది?.. ఆ పార్టీలోనే కాక దేశ రాజకీయాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది. ఒడిషా రాష్ట్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బహిరంగ లేఖతో మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఓపెన్ కామెంట్ దాకా చేరుకున్నది. ప్రియాంక భర్త రాబర్ట్ వద్రా సైతం స్పందించడంతో రానున్న రోజుల్లో ఏ మలుపు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
పార్టీ బలహీనంగా ఉన్న టైమ్‌లో.. :
నాయకత్వ (Congress Leadership) మార్పు, భావి ప్రధాని అంటూ పరస్పరం భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం కావడంతో పార్టీ ఇరుకున పడినట్లయింది. ఒక వర్గం ప్రియాంకాగాంధీకి, మరోవర్గం రాహుల్‌గాంధీ(Rahul Gandhi)కి మద్దతు పలుకుతున్నాయి. పార్టీ అంతర్గత వ్యవహారమే అయినప్పటికీ ఇది దాని పరిధి దాటి అనేక సందేహాలకు దారితీసే అంశంగా మారింది. పార్టీలో నాయకత్వ సంక్షోభం లేదని సీనియర్ నేతలు చెప్తున్నా ఓపెన్ లెటర్స్, ఓపెన్ కామెంట్లతో గాంధీ కుటుంబంలో అనూహ్య పరిణామాలకు దారితీసింది. ఒక్కో రాష్ట్రంలో పార్టీ బలహీనమవుతూ కుంచించుకుపోతున్న టైమ్‌లో ప్రియాంక (Priyanka Gandhi) వర్సెస్ రాహుల్ ఇష్యూ తలెత్తడం నేతలకు మింగుడుపడడంలేదు. కొందరి అభిప్రాయం మాత్రమేనంటూ పార్టీ లీడర్షిప్ లైట్‌గా తీసుకుని వదిలేసినా ఇది ఎటు దారితీస్తుందోననే సందేహాలూ కొందరి మధ్య గుసగుసలుగా మారాయి.
భావి ప్రధాని, గ్లోబల్ లీడర్‌గా రాహుల్ :
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా భారత్ జోడో యాత్రతో రాహుల్‌గాంధీ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆ పరిస్థితుల్లోనే ‘ఇండియా’ కూటమి ఏర్పాటైంది. ఎన్నికల ప్రచారంలో రాహుల్ ప్రసంగాలు జనాన్ని ఆకట్టుకున్నది. 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది. బీజేపీ దూకుడును అరికట్టగలిగింది. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్‌గాంధీ ఎన్నికయ్యారు. పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నప్పటికీ సైద్ధాంతికంగా, పార్టీలో పాలసీ మేకర్‌గా రాహుల్‌గాంధీకి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్‌ను లీగల్‌గానే ఢీకొట్టేలా ‘సర్’ (SIR) అంశాన్ని లేవనెత్తారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అది ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా జాతీయ స్థాయిలో వివిధ పార్టీలను ఆ అంశంలో ఒక్క తాటి మీదకు తేగలిగారు.
ప్రియాంక నాయకత్వంవైపు కొందరు :
కీలకమైన అంశాలపై లోక్‌సభలో చర్చ జరిగే సమయంలో రాహుల్ గైర్హాజరు కావడంపై విమర్శలు వచ్చాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, సవరణలు కాంగ్రెస్ ఆలోచనకు భిన్నంగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు పార్లమెంటు ఆవరణలో ధర్నా చేసినా దానిపై ప్రభుత్వాన్ని ఢీకొట్టే తీరులో రాహుల్ వ్యవహరించలేదన్న ఆరోపణలూ వచ్చాయి. ఆయన జర్మనీ టూర్ చర్చకు దారితీసింది. సరిగ్గా ఈ సమయంలోనే పార్లమెంటు శీతాకాల సమావేశాల ముగింపు సందర్భంగా లోక్‌సభ స్పీకర్ ఇచ్చిన టీ పార్టీకి ప్రియాంక హాజరయ్యారు. ప్రియాంకాగాంధీ సమయస్ఫూర్తి, సూటి విమర్శలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం, వాక్చాతుర్యం కొందరు నేతలను ఆకట్టుకున్నది. సోనియాగాంధీకి ఒడిషా మాజీ ఎమ్మెల్యే మహ్మద్ మొకిమ్ రాసిన బహిరంగ లేఖ, దానికి మద్దతుగా కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఓపెన్ కామెంట్, దీనిపై రాబర్ట్ వద్రా రియాక్షన్.. ఇవన్నీ ఆమె నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు స్పష్టమవుతున్నది.
ఫ్యామిలీలో పొలిటికల్ వార్ :
గాంధీ ఫ్యామిలీలో నాయకత్వం లేదా పవర్ కోసం అన్నా చెల్లెళ్ళ మధ్య ఎలాంటి వివాదం లేనప్పటికీ ఆ పార్టీ నేతల నుంచి డిమాండ్లు రావడం గమనార్హం. ఇద్దరూ పార్టీ లైన్ ప్రకారమే వ్యవహరిస్తున్నప్పటికీ, సమిష్టి నిర్ణయాల్లో భాగస్వాములవుతున్నట్లు చెప్తున్నా సంస్థాగతంగా బలోపేతం కావడానికి ప్రియాంకాగాంధీకి బాధ్యతలు అప్పజెప్పాలనే మాటలు వినపడడం గమనార్హం. ఎన్నికల్లో వరుస ఓటములతో రాహుల్‌గాంధీని పక్కకు తప్పించి ప్రియాంకకు పగ్గాలు అప్పజెప్పాలనే స్థితికి చేరుకున్నది. ఇది సంక్షోభంగా మారకముందే పార్టీ నుంచి స్పష్టమైన ప్రకటన రావాలన్న వాదనా సొంత పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నది. చివరకు సోనియాగాంధీ తర్వాత పార్టీకి వారసులెవరు అనేదాకా వెళ్తుందేమోననే అభిప్రాయాలూ వస్తున్నాయి. పార్టీ లైన్‌కు భిన్నంగా అభిప్రాయాలను వెల్లడించేవారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నా అంతర్గతంగా రెండు వర్గాలు లేకుండా చూసుకోవడం నాయకత్వానికి అవసరమనేది వారి భావన.
Read Also: బీఆర్ఎస్ను ‘నీళ్ళ’తో కడిగేద్దాం : సీఎం
Follow Us On: X(Twitter)


