కలం, స్పోర్ట్స్: భారత్‌లో పాఠశాల స్థాయి టేబుల్ టెన్నిస్‌ను (Table Tennis) మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడింది. నోయిడాలోని ప్రోమీథియస్ స్కూల్‌లో ఐటిటీఎఫ్ లెవల్-1 కోచ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సోమవారం ప్రారంభమైంది. ఇంటర్నేషనల్ స్కూల్స్ స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ (ISSO), ఇంటర్నేషనల్ స్కూల్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISF) అకాడమీ, ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ (ITTF) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
అయిదు రోజుల పాటు..
ఐదు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ శుక్రవారం ముగియనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 22 మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు, స్కూల్ కోచ్‌లు, టేబుల్ టెన్నిస్ కోచ్‌లు ఇందులో పాల్గొంటున్నారు. అంతర్జాతీయ ప్రమాణాల కోచింగ్ విధానాలను వారికి అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. థాయ్‌లాండ్‌కు చెందిన ఐటిటీఎఫ్ ఎడ్యుకేటర్ క్రిస్టినా చీ ఈ శిక్షణను నిర్వహిస్తున్నారు.
టేబుల్‌పై ప్రాక్టికల్ శిక్షణ..
తరగతి గది బోధనతో పాటు టేబుల్‌పై ప్రాక్టికల్ శిక్షణ కూడా ఇస్తున్నారు. కోచింగ్ ప్రాథమికాలు, సాంకేతిక నైపుణ్యాలు, శిక్షణ ప్రణాళిక, ఆటగాళ్ల అభివృద్ధి, చిన్నారులకు అనుకూలమైన శిక్షణ వాతావరణం వంటి అంశాలపై ప్రత్యేకంగా బోధిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయులు, కోచ్‌లకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించి, యువ క్రీడాకారులకు మెరుగైన మార్గనిర్దేశం చేయవచ్చని క్రిస్టినా చీ తెలిపారు.
ప్రపంచ స్థాయి కోచ్ ఎడ్యుకేషన్..
ఇదే లక్ష్యంతో ఐఎస్‌ఎస్‌వో ప్రపంచ స్థాయి కోచ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలను భారత్‌కు తీసుకొస్తోందని సహ డైరెక్టర్ గౌరవ్ దీక్షిత్ వెల్లడించారు. ఇటీవల ఐఎస్‌ఎస్‌వో ఫిబా, బీడబ్ల్యూఎఫ్, కుక్కివాన్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి కోచ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు నిర్వహించింది. అలాగే సెర్బియాలో జరిగిన ఐఎస్‌ఎఫ్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌కు భారత విద్యార్థులను పంపించింది. ఈ కార్యక్రమాల ద్వారా పాఠశాల క్రీడలను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది.

