కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) నగరంలోని ఆరోగ్య ఆసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. ఓ రోగి ఆపరేషన్ థియేటర్‌లోనే, శస్త్రచికిత్స ప్రారంభం కాకముందే మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంగా మత్తు మందు (అనస్థీషియా) మోతాదుకు మించి ఇవ్వడంతోనే మరణించాడని రోగి తరఫు వారు చెబుతున్నారు.
ఆసుపత్రి యాజమాన్యం మౌనం..
ఖమ్మం కార్పొరేషన్ పరిధి ఖానాపురానికి చెందిన రిటైర్డ్ కరెంట్ లైన్ మెన్ బలుసు బాబురావు అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరారు. ఆపరేషన్ చేయడానికి ముందు ఇచ్చిన మత్తు మందు వికటించడంతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. బాబురావు మృతి చెంది గంటలు గడుస్తున్నా, మరణానికి కారణాలను ఆసుపత్రి యాజమాన్యం, వైద్యులు ఇప్పటివరకు వెల్లడించకపోవడం గమనార్హం.
సముదాయించిన పోలీసులు..
దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలంటూ నినదించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న బంధువులను సముదాయిస్తూ, అసలు ఏం జరిగిందనే వివరాలపై ఆరా తీస్తున్నారు. ఆసుపత్రి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. పూర్తి వివరాలు, ఆసుపత్రి వర్గాల వివరణ ఇంకా తెలియాల్సి ఉంది.

