Mobile Popup Ad
Mobile Popup Ad

రాముడి హుండీకి బీజేపీ శఠగోపం: కె.రామకృష్ణ

కలం, ఖమ్మం బ్యూరో: విపక్షాలను చీల్చి, రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నంలో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అవహాస్యం చేస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ (K Ramakrishna) అన్నారు. అధికారంలోకి రావడానికి కారణమైన రాముడి హుండీకే శఠగోపం పెడుతోందని ఆరోపించారు. అయోధ్య రామాలయానికి దేశవ్యాప్తంగా రూ.3,624 కోట్ల విరాళాలు వస్తే, అందులో రూ.1,400 కోట్లను బీజేపీ అనుబంధ సంస్థలైన విశ్వహిందూ పరిషత్, ఆర్‌ఎస్‌ఎస్ దారి మళ్లించాయని ధ్వజమెత్తారు.

అయోధ్య విరాళాలపై విచారణ చేయాలి..

భద్రాచలంలో మంగళవారం ప్రారంభమైన సీపీఐ ఉమ్మడి ఖమ్మం జిల్లా కౌన్సిల్ సభ్యుల రాజకీయ సైద్ధాంతిక శిక్షణ తరగతుల్లో కె.రామకృష్ణ ముఖ్య అతిథిగా మాట్లాడారు.

టన్నుల కొద్దీ విరాళాలుగా వచ్చిన బంగారం, వెండితో పాటు నిధుల కైంకర్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ​దేశంలో ఆర్థిక అంతరాలు నానాటికీ పెరుగుతున్నాయని, 2014లో రూ. 55 లక్షల కోట్లుగా ఉన్న దేశ అప్పులు ప్రస్తుతం రూ.230 లక్షల కోట్లకు చేరాయని విమర్శించారు.

మార్పు కోరుతున్న యువత..

గత 12 ఏళ్లలో నిరుద్యోగ నిర్మూలన, నల్లధనం వెనక్కి తెస్తామన్న ఏ ఒక్క వాగ్దానాన్ని ప్రధాని మోదీ అమలు చేయలేదని రామకృష్ణ అన్నారు. దేశ యువత మార్పును కోరుకుంటోందని, పొరుగు దేశాలైన నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లో వచ్చిన పరిణామాలు భారత్‌లోనూ పునరావృతం కానున్నాయని జోస్యం చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు..

​పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రజా సమస్యలపై పోరాటాలకు సీపీఐ కార్యాచరణ సిద్ధం చేసిందని రామకృష్ణ వెల్లడించారు. ఇందులో భాగంగా ఆగస్టు ఆరో తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేపడతామన్నారు.

కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 1న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. పార్టీ జిల్లా కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సీపీఐ నేతలు సాబీర్ పాషా, భాగం హేమంతరావు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>