కలం, వెబ్ డెస్క్: వైవిధ్యభరితమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకువచ్చే యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) సామాజిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భీమవరంలో రక్షాదళ్ మహేందర్ నేతృత్వంలో నిర్వహించిన విద్యా వితరణ కార్యక్రమంలో నిఖిల్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సుమారు 1000 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించే పిల్లలకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, ఇతర విద్యా సామగ్రితో కూడిన ఈ కిట్లను ఆయన స్వయంగా అందజేశారు. పేద కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడంతోపాటు, చదువుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ.. బంగారు భవిష్యత్తును అందించే శక్తి విద్యకే ఉందని స్పష్టం చేశారు. విద్యార్థులంతా తమ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించి, ఉన్నతమైన కలలు కనాలని కోరారు. నిరంతర శ్రమ, పట్టుదలతో వాటిని నిజం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తమ ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలన్నారు.

