Mobile Popup Ad
Mobile Popup Ad

ఆయిల్ పామ్‌తో అధిక ఆదాయం.. రైతులకు కలెక్టర్ పిలుపు

కలం, నిజామాబాద్ బ్యూరో : అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో గణనీయమైన ఆదాయాన్ని అందించే ఆయిల్ పామ్ పంట సాగు (Oil Palm Cultivation) వైపు రైతులు దృష్టి సారించాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (ILA Tripathi) పిలుపునిచ్చారు. మాక్లూర్ మండలం చిన్నాపూర్ రైతు వేదికలో మంగళవారం ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై రైతులకు ఆయిల్ పామ్ సాగు ప్రయోజనాలను వివరించారు. సంప్రదాయ వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు చేపడితే రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయిల్ పామ్ సాగు చేస్తున్న ఆదర్శ రైతులు జైడి మధుసూదన్, లక్ష్మణ్, గడ్డం గంగారెడ్డి, సుధాకర్ తదితరులు తమ అనుభవాలను రైతులతో పంచుకున్నారు.

ప్రభుత్వ సబ్సిడీతో ఆయిల్ పామ్ సాగు చేపట్టామని, ప్రస్తుతం మంచి దిగుబడులు పొందుతున్నామని రైతులు తెలిపారు. అంతర పంటల సాగు ద్వారా అదనపు ఆదాయం కూడా లభిస్తోందని వివరించారు. డ్రిప్ పరికరాల కోసం ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ అందిస్తోందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట, సత్తుపల్లి ప్రాంతాలలో ఆయిల్ పామ్ సాగును పరిశీలించిన అనంతరం ఈ పంటను చేపట్టామని, ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ సాగులో శ్రమ, ఖర్చు తక్కువగా ఉంటుందని రైతులు తెలిపారు. బైబ్యాక్ ఒప్పందం ప్రకారం కంపెనీలు మద్దతు ధరతో దిగుబడులను సేకరిస్తున్నాయని వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి (ILA Tripathi) మాట్లాడుతూ, జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. రైతులు ముందుకు వచ్చి ఈ పంటను సాగు చేసి అధిక లాభాలు పొందాలని సూచించారు. ఈ సీజన్‌లో 1600 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, రైతుల ప్రయోజనాల దృష్ట్యా కనీసం 2000 ఎకరాలలో సాగును ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు.

జిల్లాలోనే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుందని, దిగుబడుల సేకరణకు కలెక్షన్ సెంటర్‌లు  అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, ప్రీ-యూనిక్ కంపెనీ ఏరియా మేనేజర్ సాయి కిరణ్, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Read Also: కాళేశ్వరం ప్రాజెక్ట్ నడపలేం: మంత్రి ఉత్తమ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>