కలం, వెబ్ డెస్క్: పాకిస్థాన్‌లో (Pakistan) మరోసారి భారీ ఉగ్ర దాడి జరిగింది. బలోచిస్థాన్ ప్రావిన్స్‌లోని జియారత్ జిల్లాలో మంగీ డ్యాం వద్ద గస్తీ నిర్వహిస్తున్న పాక్ పోలీసులే లక్ష్యంగా గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణరహితంగా కాల్పులకు దిగారు. ఈ ఘటనలో 9 మంది పోలీసులు అక్కడికక్కమే మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు డిప్యూటీ కమిషనర్ అబ్దుల్ ఖుద్దూస్ తెలిపారు.
మరికొంతమంది పోలీసులను తమతో పాటే ఎత్తుకెళ్లిపోయారని.. వారి కోసం గాలిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు. మరణించిన వారిలో ఇద్దరు సీనియర్ పోలీసులు ఉన్నారు. గత మే నెలలో కూడా బలోచ్ ఆర్మీ 20 మంది పాక్ (Pakistan) సైనికులను హతమార్చింది.
ప్రతీకార దాడేనా..?
తాలిబన్ పార్టీకి చెందిన 15 మంది సభ్యులను ఇటీవల పాక్ రేంజర్లు హతమార్చారు. దీనిపై భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. గంటల కొద్దీ రహదారులను దిగ్బంధించారు. దీనికి ప్రతీకారంగానే తాజా దాడి చోటు చేసుకున్నట్లు బలోచిస్థాన్ మీడియా పేర్కొంది. ఈ దాడిని పాక్ హోం మంత్రి మోహ్‌సిన్ నఖ్వి ఖండించారు. మరణించిన సైనికులను దేశానికి గర్వకారణంగా అభివర్ణించారు.
దశాబ్దాలుగా అక్కడ హింస..
దాడి జరిగిన ప్రాంతం బలోచిస్థాన్ రాజధాని క్వెట్టాకు అతి సమీపంలో.. మొత్తంగా ఈ ప్రావిన్స్ అటు ఆఫ్గనిస్థాన్, ఇటు ఇరాన్ దేశాలకు సరిహద్దుగా ఉంది. దశాబ్దాలుగా ఇక్కడ స్థానిక మిలిటెంట్ల గ్రూపులు, పాక్ సైన్యం మధ్య ఘర్షణ జరుగుతోంది. పాకిస్థాన్ ప్రభుత్వం తమపై గుత్తాధిపత్యం మానుకోవాలనేదే వీరి ప్రధాన డిమాండ్.
Read Also: కాళేశ్వరం ప్రాజెక్ట్ నడపలేం: మంత్రి ఉత్తమ్
Follow Us On: X(Twitter)

