కలం, మహబూబ్ నగర్ బ్యూరో : ఆపరేషన్ ముస్కాన్–12 (Operation Muskaan) కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను మహబూబ్ నగర్ ఎస్పీ డి. జానకి (Mahabubnagar SP Janaki) మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జూలై 1 నుండి జూలై 31 వరకు నిర్వహిస్తున్న “ఆపరేషన్ ముస్కాన్–12” కార్యక్రమం ద్వారా 18 సంవత్సరాల లోపు బాలబాలికలను గుర్తించి, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, బలవంతపు భిక్షాటన, గృహ పనులు, ఇతర ప్రమాదకర పనుల్లో నిమగ్నమై ఉన్న పిల్లలను రక్షించి, తిరిగి విద్యా సంస్థల్లో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
18 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకోకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె (Mahabubnagar SP) హెచ్చరించారు. ప్రతి చిన్నారి విద్యను అభ్యసించే హక్కును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. బాల కార్మికులను ఎక్కడైనా గుర్తించినా వెంటనే పోలీసు శాఖ, చైల్డ్‌లైన్ లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై బాలల భవిష్యత్తును కాపాడేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్.బీ.రత్నం, ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీ రమణ రెడ్డి, సీడబ్ల్యూసీ ఛైర్మన్ నయీముద్దీన్, కార్మిక శాఖ అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: కాళేశ్వరం ప్రాజెక్ట్ నడపలేం: మంత్రి ఉత్తమ్
Follow Us On : WhatsApp

