కలం, నిజామాబాద్ బ్యూరో: వసతి గృహాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని నిజామాబాద్ (Nizamabad) జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) హెచ్చరించారు. మంగళవారం జక్రాన్‌పల్లి మండలం మునిపల్లిలోని (Munipalli) మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్‌రూమ్, కిచెన్, డైనింగ్ హాల్, డార్మెటరీ, తరగతి గదులను పరిశీలించి ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థినులకు భోజనం అందుతున్నదా లేదా అనే అంశాన్ని ఆరా తీశారు. వంటగది, డైనింగ్ హాల్, స్టోర్‌రూమ్ అపరిశుభ్రంగా ఉండటం, ఈగలు అధికంగా ఉండటంపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఏజెన్సీని మార్చాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో వ్యాధుల ముప్పు అధికంగా ఉండే నేపథ్యంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
విద్యార్థినుల ఆరోగ్య పరిరక్షణలో రాజీ పడొద్దని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ శుభ్రతతో కూడిన పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీ తరగతి గదిని సందర్శించిన కలెక్టర్ (Collector Ila Tripathi), విద్యార్థినులతో ముచ్చటించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితర సబ్జెక్టులపై ప్రశ్నలు అడిగి వారి ప్రతిభను పరీక్షించారు. సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థినులను బహుమతులు అందించి అభినందించారు. ఈ తనిఖీలో స్థానిక తహసీల్దార్ కిరణ్మయి, కళాశాల ప్రిన్సిపాల్ అనూష తదితరులు పాల్గొన్నారు.
Read Also: ధరణి పోర్టల్‌లో భారీగా అక్రమాల గుర్తింపు
Follow Us On: Instagram

