కలం, వెబ్ డెస్క్ : సింగరేణికి తాడిచర్ల -2 కోల్ బ్లాక్ కేటాయించినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ప్రకటించారు. ఈ రోజే (మంగళవారం) కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో లక్షలాది ప్రజల గుండె చప్పుడు అయిన సింగరేణికి (Singareni) కేంద్రం అన్ని రకాలుగా సహకారాలు అందిస్తోందని స్పష్టం చేశారు.
సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి పెంచకోవాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ సింగరేణికి వచ్చేలా చొరవ తీసుకున్నట్లు వెల్లడించారు. 35 సంవత్సరాలకు తగినంత నిల్వలు నైనీ కోల్ బ్లాక్ లో ఉన్నాయన్నారు. దీని ద్వారా సింగరేణికి రూ.75వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఇందులో భాగంగానే సింగరేణికి తాడిచర్ల-2కోల్ బ్లాక్‌ను కేటాయించినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కేటాయింపుతో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరగడంతో పాటు రాష్ట్ర పారిశ్రామిక, విద్యుత్ రంగాల అవసరాలకు బొగ్గు సరఫరా బలోపేతం కానుందని ఆయన (Kishan Reddy) వెల్లడించారు.
తాడిచర్ల-2 కోల్ బ్లాక్ కేటాయింపు సింగరేణి సంస్థ అభివృద్ధికి కీలక ముందడుగుగా నిలుస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి కూడా ఊతం లభించే అవకాశం ఉందన్నారు.

