కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూ భారతిలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల అండతోనే భూ దోపిడీ జరుగుతోందన్నారు. కాంగ్రెస్ నేతల అండతో భూ మాఫియా రెచ్చిపోతుందన్నారు. రైతుల ఇబ్బందులు తొలగించేందుకే కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంత వరకు బాగానే పనిచేసిందన్నారు.
200 ఎకరాలు బదిలీ..
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో భారీగా భూములు చేతులు మారుతున్నారని ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ఆరోపించారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే అక్రమంగా సుమారు రెండు వందల ఎకరాలను బదిలీ చేసుకున్నారని వివరించారు. ఇక్కడ ఒక్కొక్క ఎకరం కనీసం రూ.2 కోట్లు పలుకుతుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు.
శేరిలింగంపల్లిలోని ఖాజాగూడలో ఒకటిన్నర ఎకరాను సహస్ర అనే కంపెనీకి అక్రమంగా దోచి పెట్టారన్నారు. జిల్లా కలెక్టర్, సీసీఎల్ఏకు తెలియకుండానే బదిలీ జరిగిపోయిందన్నారు. దీని వెనుక ఉన్న వ్యక్తులను బయటకు లాగాలన్నారు.
పొంగులేటికి తెలియదా..?
ప్రతి రోజు పోర్టల్ లో ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే వివరాలు రెవెన్యూ మంత్రి పొంగులేటి (Minister Ponguleti) వద్దకు వెళ్తుంటాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇంత భూ దోపిడీ జరుగుతుంటే పొంగులేటికి తెలియదా.. అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో అక్రమంగా 22 వేల భూ లావాదేవీలు జరిగాయని, ఇదంతా మంత్రికి తెలియకుండా జరుగుతోందా.. అని ఆశ్చర్యపోయారు. జనగామలో చలాన్ల కుంభకోణం వెలుగు చూసినా.. నేటి వరకు చర్యల్లేవన్నారు.
Read Also: కాంగ్రెస్‌లో ఒరిజనల్ vs వలసలు!
Follow Us On : WhatsApp

