కలం, వెబ్ డెస్క్ : చిన్నారులే దేశ సంపద, దేశ భవిష్యత్తని, తెలంగాణ–2047 లక్ష్య సాధనలో నేటి చిన్నారులే కీలక పాత్ర పోషిస్తారని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఏ ఒక్క చిన్నారికీ అంగన్‌వాడీ సేవలు అందకుండా ఉండకూడదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాల (Mobile Anganwadi Centers)ను ప్రారంభిస్తోందని ఆమె తెలిపారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ (MCR HRD)లో కార్మిక శాఖ మంత్రి వివేక్‌తో కలిసి కార్మిక శాఖ సహకారంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ రూపొందించిన మొబైల్ అంగన్‌వాడీ వాహనాన్ని మంత్రి సీతక్క (Minister Seethakka) జెండా ఊపి ప్రారంభించారు. ఈ మొబైల్ అంగన్‌వాడీ వాహనం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఇందిరమ్మ కాలనీలో అంగన్‌వాడీ సేవలు అందించనుంది.
ఇప్పటివరకు సాంప్రదాయ అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకే పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, ప్రీ-స్కూల్ విద్య, తల్లి శిశు సంక్షేమ సేవలు అందుబాటులో ఉండేవి. అయితే అంగన్‌వాడీ కేంద్రాలు లేని ప్రాంతాల్లో నివసించే చిన్నారులు, ముఖ్యంగా పనుల కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వలస వచ్చే కార్మికుల పిల్లలు ఈ సేవలకు దూరమవుతున్నారు. అలాంటి ఒక్క చిన్నారి కూడా ప్రభుత్వ సేవలకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఈ మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలను (Mobile Anganwadi Centers) అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి వివరించారు.
సాధారణ అంగన్‌వాడీ కేంద్రాల్లో లభించే పోషకాహారం, ఆరోగ్య పరీక్షలు, ఎదుగుదల పర్యవేక్షణ, ప్రీ-స్కూల్ విద్యతో పాటు తల్లి శిశు సంక్షేమానికి సంబంధించిన అన్ని సేవలు ఈ మొబైల్ వాహనాల్లో కూడా అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. వలస కార్మికులు ఎక్కువగా నివసించే ప్రాంతాలకు ఈ వాహనాలు నేరుగా వెళ్లి సేవలు అందిస్తాయని పేర్కొన్నారు.
ఒక్కో మొబైల్ అంగన్‌వాడీ వాహనం దాదాపు పది అంగన్‌వాడీ కేంద్రాలకు సమానంగా సేవలు అందించే సామర్థ్యాన్ని కలిగి ఉందని, దీని ద్వారా సుమారు 300 మంది లబ్ధిదారులకు సేవలు అందనున్నాయని మంత్రి సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ శృతి ఓజా, జాయింట్ డైరెక్టర్ మోతి, మేడ్చల్ మల్కాజ్గిరి డీడబ్ల్యూఓ శారదతో పాటు కార్మిక, మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also: కాఫీతో మైగ్రేన్ తగ్గుతుందా? పెరుగుతుందా? నిపుణులు చెప్పిన నిజాలు
Follow Us On: Instagram

