కలం, వెబ్ డెస్క్ : పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి ఏ అనుమతులు లేవు.. కేసీఆర్ అబద్ధాలు చెప్పారని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తెలంగాణ సచివాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు (Palamuru Rangareddy project) కు గత ప్రభుత్వం రూ.27వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నాయకులు దుర్మార్గంగా బరితెగించి అబద్దాలు చెబుతున్నారని ఉత్తమ్ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడ్డాక పాలమూరు ప్రాజెక్ట్ కోసం రెండేళ్లలో రూ.7 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. 45 టీఎంసీలకు ఒప్పుకున్నారనేది అవాస్తవమన్నారు. హరీశ్ రావు(Harish Rao) తెలివితో మాయమాటలు చెబుతున్నారని.. ఆయన విచిత్ర, వికారం మాటలను ఖండిస్తున్నామన్నారు. గతంలోని కేసీఆర్ ప్రభుత్వానికి పాలమూరు కట్టాలని లేనందునే 2020లో సెంట్రల్ కు పంపిన నీటి వాటాల పంపకాల్లో పాలమూరు, SLBC, డిండికి నీళ్లు అడగలేదని ఉత్తమ్ ఆరోపించారు.
పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. 1.83 లక్షల కోట్లు ఇరిగేషన్ కు ఖర్చు చేసిన బీఆర్ఎస్ ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కట్టిన ప్రాజెక్టులతోనే నీళ్లను పంపిణీ చేశారని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పేరుతో ఏపీ నీటి దోపిడీకి కేసీఆర్(KCR) సహకరించారని ఉత్తమ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులను నిలిపివేశామని చెప్పారు. వచ్చే మూడేళ్లలో SLBC ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని మంత్రి హామీనిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలమూరు ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.7వేల కోట్ల లెక్కలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. హరీశ్ రావు లాగా కమీషన్లు తీసుకునే అలవాట్లు తమకు లేవని ఎద్దేవా చేశారు. ఏదో అద్భుతాలు చేసినట్లు కేసీఆర్ ఫ్యామిలీ వ్యాఖ్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్(Uttam Kumar Reddy) చురకలంటించారు.
Read Also: ఆ క్రిమినల్‌తో ఫ్లైట్ జర్నీలు చేసిన ట్రంప్!
Follow Us On: Instagram


