కలం, నల్లగొండ బ్యూరో : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ (Thungathurthi Congress)లో వర్గపోరు ఒక్కసారిగా రచ్చకెక్కింది. ఇటీవల ప్రకటించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాలు పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన పాత కార్యకర్తలను పక్కనపెట్టి, ఇటీవల ఇతర పార్టీల నుంచి చేరిన వారికి కీలక పదవులు ఇవ్వడంపై సొంత పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి.
కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామెల్ ఏకపక్ష నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వీడకుండా లాఠీ దెబ్బలు తింటూ, కేసులు ఎదుర్కొంటూ జెండాను మోసిన సీనియర్ నేతలు, కార్యకర్తలను పూర్తిగా విస్మరించారని పాత క్యాడర్ ఆరోపిస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం వివాదానికి కారణమైందని చెబుతున్నారు.
అంతేకాకుండా, కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధం లేకుండా, ప్రాథమిక సభ్యత్వం కూడా లేని కొందరికి పదవులు కట్టబెట్టడం పాత కాంగ్రెస్ నేతను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. నియోజకవర్గ పరిధిలోని మొత్తం 9 మండలాల్లో ఏడు మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికే దక్కడం అసంతృప్తిని మరింత పెంచి రచ్చకు కారణమని తెలుస్తున్నది.
తిరుగుబాటులో స్థానిక నేతలు
ఎమ్మెల్యే మందుల సామెల్ తీరును నిరసిస్తూ ఇటీవల అసలు కాంగ్రెస్ కార్యకర్తలు, స్థానిక నేతలు రోడ్డెక్కారు. అర్వపల్లి సమీపంలోని సూర్యాపేట–జనగామ ప్రధాన రహదారిపై ‘సేవ్ కాంగ్రెస్’ పేరుతో భారీ ధర్నా నిర్వహించారు. పార్టీకి విధేయులైన, అందరికీ ఆమోదయోగ్యమైన నాయకులకే మండల అధ్యక్ష పదవులు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాలలో యోగానంద ఆధ్వర్యంలో అసంతృప్త నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని, పీసీసీతో పాటు ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్‌కు ఎమ్మెల్యే సామెల్‌పై ఫిర్యాదు చేయాలని సమావేశంలో తీర్మానించారు.
సొంత పార్టీ ఎంపీ లేఖపై చర్చ
మండల కమిటీల నియామకాల్లో కనీస సమన్వయం పాటించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తుంగతుర్తికి చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్యకు, ఇదే నియోజకవర్గ పరిధిలోకి వచ్చే యాదాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బీర్ల ఐలయ్యకు సమాచారం ఇవ్వకుండానే నియామకాలు జరిగాయనే చర్చ సాగుతోంది. అలాగే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోలేదనే అసంతృప్తి క్యాడర్లో వ్యక్తమైంది.
దీంతో మండల కమిటీల నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ ఎంపీ చామల పీసీసీ చీఫ్‌కు లేఖ రాయడం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఇదిలా ఉండగా, తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు సంప్రదాయంగా సుమారు 40 శాతం స్థిరమైన ఓటు బ్యాంకు ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లే దీనికి నిదర్శనమని వారు గుర్తుచేస్తున్నారు. పార్టీని నమ్ముకుని పనిచేసిన క్యాడర్‌ను విస్మరిస్తే భవిష్యత్తులో తీవ్ర నష్టం తప్పదని పలువురు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
ఎమ్మెల్యే చుట్టూ కోటరీ ఉచ్చు?
ఎమ్మెల్యే మందుల సామెల్ తెలంగాణ ఉద్యమం నుంచి ఎదిగిన నాయకుడు. కార్యకర్తల కష్టం, పార్టీ కోసం చేసిన త్యాగాలు ఆయనకు బాగా తెలుసని స్థానిక నేతలు అంటున్నారు. అయితే ఆయన చుట్టూ ఏర్పడిన కోటరీ ప్రభావం వల్లే ఈ పరిస్థితి నెలకొన్నదని క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే స్వయంగా ఈ పరిణామాలను గమనించడం లేదా, లేక ఆయన చుట్టూ ఉన్నవారే వాస్తవ పరిస్థితులను ఆయనకు తెలియనివ్వడం లేదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం తుంగతుర్తి కాంగ్రెస్‌లో ఒకవైపు పాత కాంగ్రెస్ నాయకులు, మరోవైపు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాయకులు అనే రెండు వర్గాలుగా పరిస్థితి మారిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేపై సొంత పార్టీ కార్యకర్తలే ‘సేవ్ కాంగ్రెస్’ అంటూ రోడ్డెక్కడం అధిష్టానం సీరియస్‌గా తీసుకోవాల్సిన అంశమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పాత, కొత్త నాయకుల మధ్య సమన్వయం సాధించి, పార్టీ కోసం కష్టపడిన నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయకపోతే తుంగతుర్తి కాంగ్రెస్‌కు భవిష్యత్తులో కోలుకోలేని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.

