కలం, వెబ్ డెస్క్: సమాజంలో నేరాలకు పాల్పడుతున్న కొందరు వ్యక్తులకు జైలు శిక్ష వేసినా అదే తీరులో ప్రవర్తిస్తున్నారు. తాజాగా శ్రీలంక (Sri Lanka)లో ఇదే తరహా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నెగోంబోలో ఉన్న జైలులో గ్యాంగ్ వార్ జరుగగా ఇద్దరు ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే.. నెగోంబో జైలులో డ్రగ్స్ కోసం ఇద్దరు ఖైదీల మధ్య గొడవ మొదలైంది. ఇది కాస్తా కొద్ది సేపటికే గ్యాంగ్ వార్‌గా ముదిరింది. దీంతో ఖైదీలంతా రెండు గ్రూపులుగా విడిపోయి ఇష్టారీతిన దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
గొడవ గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను ఆపేందుకు రంగంలోకి దిగారు. శ్రీలంక ఆర్మీ సైతం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. గొడవలో గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జైలులో డ్రగ్స్ సరఫరా, వినియోగం చేసే ముఠా, దాన్ని వ్యతిరేకించే ముఠా మధ్యనే ఈ గ్యాంగ్ వార్ జరిగినట్లు తెలుస్తోంది. గొడవ జరిగిన తర్వాత పలువురు జైలు భవనం పైకి ఎక్కి నిరసన తెలిపారు. అయితే పైకప్పు కూలిపోవడంతో మరో నలుగురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం జైలులో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

