కలం, ఖమ్మం బ్యూరో : నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) సందడి చేశారు. గ్రామంలో ఆదివారం కనులపండువగా నిర్వహించిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మంగళవాయిద్యాల మోతలు, భక్తుల జయజయధ్వానాల నడుమ ఆలయానికి చేరుకున్న మంత్రి పొంగులేటికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం మంత్రికి అర్చకులు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను బహూకరించారు. ఆ తర్వాత ఆయన భక్తులకు స్వయంగా అన్నం వడ్డించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆధ్యాత్మిక వేడుకలు ప్రజల మధ్య ఐక్యతను, సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయన్నారు. ముత్యాలమ్మ అమ్మవారి కృపాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి తెలంగాణ రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం నిరంతరం కట్టుబడి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

