కలం, చౌటుప్పల్ : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ దేశ ప్రధాని అయ్యేలా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో శంకర కంటి ఆసుపత్రి, ఫినిక్స్ ఫౌండేషన్ సౌజన్యంతో, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) మాట్లాడుతూ.. తనకు పదవులు ఉన్నా, లేకున్నా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే వరకు నిరంతరం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల తాను ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆ సమయంలో రాహుల్ గాంధీ తన కోసం కేటాయించినంత సమయం, రాష్ట్రంలోని ఏ ఇతర నాయకుడికి కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీతో భేటీ అయిన సందర్భంగా ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు, అలాగే తమ కుటుంబ పరిస్థితులపై కూలంకషంగా చర్చించినట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ కోసం రక్తం చిందించిన ఏ ఒక్క కార్యకర్తకూ అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే.. యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ బోర్డు విషయంలో తాను ముక్కుసూటిగా, ఓపెన్‌గా మాట్లాడాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు. సమాజ సేవలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని, నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికే ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

