కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ మహానగరంలో నిర్మించతలపెట్టిన మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుపై కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లేఖ రాశారు. హైదరాబాద్ మహానగరం భవిష్యత్‌కు ఎంతో కీలకమైన మెట్రో విస్తరణ ప్రాజెక్టును వేగవంతం చేయాలని కేంద్రమంత్రులు జి. కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్‌లకు ఓ లేఖ రాశారు. ఈ మేరకు మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
ఇందులో భాగంగా మెట్రో ఫేజ్-1ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా టేకోవర్ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విలువల నిర్ధారణ ఎస్బీఐ క్యాప్స్‌కు అప్పగించాల్సి ఉందని.. కానీ ఎస్బీఐ క్యాప్స్ పరిధిలో జరుగుతున్న ఆలస్యం కారణంగా ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని లేఖలో సీఎం చెప్పుకొచ్చారు. ఈ ఆలస్యం వల్ల మెట్రో ఫేజ్-2 వ్యయం భారీగా పెరిగే ప్రమాదం ఉందన్న సీఎం.. ఎస్బీఐ క్యాప్స్‌కు త్వరగా విలువ నిర్ధారణ అప్పగించాలన్నారు. మెట్రోప్రాజెక్టుకు సంబంధించిన రుణాల రీఫైనాన్సింగ్ పై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు మెట్రో ఫేజ్-2 నిధుల సమీకరణ కోసం ఒక సమగ్ర ఆర్థిక ప్రణాళికను రూపొందించాలని కేంద్రమంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని కేంద్రమంత్రులకు రాసిన లేఖలో సీఎం పేర్కొన్నారు.

