కలం, యాదగిరిగుట్ట: దొడ్డి కొమురయ్య (Doddi Komuraiah) ఆశయాలను కొనసాగించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు (Bhaskar Rao) అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో తొలి సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య 81వ వర్ధంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డితో కలిసి దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడైన దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగించాలన్నారు. ఆయన అడుగుజాడలలో పనిచేసే అవకాశం లభించడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ పోరాటంలో వెనుకబడిన తరగతుల కులాలకు అండగా నిలబడిన దొడ్డి కొమరయ్య మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. యువత దొడ్డి కొమురయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. దొడ్డి కొమురయ్య ఆశయాలైన సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి, బీసీ సంక్షేమ అధికారి సుబ్బారెడ్డి, కుల సంఘ నాయకులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

