Mobile Popup Ad
Mobile Popup Ad

జర్మనీ హార్స్ రైడింగ్‌లో అనుష్ అగర్వాలాకు రజతం!

క‌లం, వెబ్ డెస్క్‌: భారత స్టార్ హార్స్ రైడర్ అనుష్ అగర్వాలా (Anush Agarwala) అంతర్జాతీయ వేదికపై మరోసారి అద్భుత ప్రదర్శన చేశారు. జర్మనీలోని హగెన్‌లో జరిగిన ప్రఖ్యాత కావాలీరో డ్రెస్సాజ్ డేస్ పోటీల్లో ఆయన రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక విజయంతో అంతర్జాతీయ స్థాయిలో దేశంలోనే అత్యుత్తమ రైడర్లలో ఒకరిగా ఆయన తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. ఈ అంతర్జాతీయ ఈవెంట్‌లోని సీడీఐ1 ప్రిక్స్ సెయింట్ జార్జెస్ పోటీల్లో మొత్తం 22 మంది రైడర్లు పాల్గొన్నారు.

ఇందులో అనుష్ అగర్వాలా తన గుర్రం ‘స్ట్రెయిట్ హార్స్ ఫ్లోరియానా’తో కలిసి బరిలోకి దిగారు. ఈ జోడీ అద్భుతమైన ప్రదర్శనతో 70.147 శాతం స్కోరు సాధించి, రెండో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది పీఎస్‌జీ విభాగంలో భారత అథ్లెట్లలోనే అత్యధిక స్కోరు సాధించిన ఘనత కూడా అనుష్ సొంతమైంది. ప్రస్తుతం అనుష్ అగర్వాలా అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో భారతదేశంలో మొదటి స్థానంలో, ఆసియాలోనే రెండో స్థానంలో ఉన్నారు. అలాగే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో కొనసాగుతున్నారు.

గతంలో ఆయన ఆసియా క్రీడల్లో టీమ్ డ్రెస్సాజ్ విభాగంలో బంగారు పతకం కూడా గెలిచారు. అయితే, ఇంతటి ఘనమైన రికార్డులు ఉన్నప్పటికీ, త్వరలో జరగబోయే ఆసియా క్రీడల ప్రధాన జట్టులో అనుష్‌కు చోటు దక్కలేదు. సెలక్షన్ కమిటీ జూన్ 16న విడుదల చేసిన జాబితాలో ఆయనను రిజర్వ్ ప్లేయర్‌గా మాత్రమే ఎంపిక చేసింది. ఈ ఎంపిక విధానంపై అనుష్ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన తనను పక్కన పెట్టారో అర్థం కావడం లేదన్నారు.

ఈ ఎంపికను సవాల్ చేస్తూ అనుష్ అగర్వాలా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గుర్రపు స్వారీ ఫెడరేషన్‌ను పర్యవేక్షిస్తున్న తాత్కాలిక కమిటీతో పాటు భారత ఒలింపిక్ సంఘంపై ఆయన కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత సెలక్షన్ లిస్ట్‌ను రద్దు చేయాలని, ఎలాంటి పక్షపాతం లేని కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసి పారదర్శకంగా ఎంపికలు జరపాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఒకవైపు కోర్టు వివాదం నడుస్తున్నప్పటికీ, మైదానంలో మాత్రం అనుష్ పతకాల వేటను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>