కలం, వెబ్‌డెస్క్: విజయ్ మాల్యా, లలిత్ మోదీ.. ఆర్థిక అక్రమాలకు, అవకతవకలకు పాల్పడి, బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి, భారత్ నుంచి పారిపోయినవాళ్లు. కొన్నేళ్లుగా విదేశాల్లో తలదాచుకుంటున్నారు. వీళ్లను భారత్‌కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నిస్తోంది. అయినా, సాధ్యం కావడం లేదు. వీళ్లు మాత్రం విదేశాల్లో ఏ చీకూ చింతా లేకుండా తిరుగుతున్నారు. ‘పట్టుకోండి చూద్దాం’ అని పరోక్షంగా సవాల్ విసురుతున్నారు. భారత చట్టాలు తమను ఏమీ చేయలేవనే ధీమాతో లెక్కలేనట్లు ప్రవర్తిస్తున్నారు. ఇది ఎన్నోసార్లు రుజువైంది. ఈ క్రమంలో వీరికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో విజయ్ మాల్యా, మరో మోడల్‌తో కలసి లలిత్ మోదీ(Lalit Modi – Vijay Mallya) కనిపించారు. ‘మేము భారత్ నుంచి పారిపోయిన అతి పెద్ద వ్యక్తులం’ అని వీడియో తీస్తున్న వ్యక్తితో లలిత్ మోదీ వ్యంగ్యంగా, నవ్వుతూ అనడం అందులో కనిపించింది. దీనికి మాల్యా సైతం ‘అవును’ అని వ్యంగ్యంగానే నవ్వుతూ చెప్పారు.
ఇటీవల భారత ప్రభుత్వం వీరితోపాటు నీరవ్ మోదీ, మొహుల్ చోక్సీ లాంటి 15 మందిని భారత్ నుంచి పారిపోయిన అతిపెద్ద ఆర్థిక నేరగాళ్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్లు ఇలా వ్యంగ్యంగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో.. ఇది భారత్‌ను వెక్కిరించినట్లు ఉందని, నెటిజన్లు మండిపడుతున్నారు. చేసిన తప్పునకు పశ్చాత్తాప పడకుండా, మాతృభూమిని ఎగతాళి చేసినట్లు మాట్లాడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నాలుగు రోజుల కిందట లండన్‌లో కింగ్ ఫిషర్ మాజీ అధిపతి విజయ్ మాల్యా(Vijay Mallya) బర్త్ డే పార్టీ జరిగింది. దీనికి ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi) సహా అనేక మంది హాజరయ్యారు. ఆ సందర్భంగా ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది.
Read Also: బెట్టింగ్ యాప్ కేసు.. దాదాపు 2 గంటల వరకు విచారణ
Follow Us On: Youtube


