Mobile Popup Ad
Mobile Popup Ad

రూట్ మార్చినా దొరికిపోయాడు.. సత్తుపల్లిలో ఒడిశా గంజాయి పట్టివేత

కలం, ఖమ్మం బ్యూరో: పోలీసుల కళ్ళు కప్పేందుకు గ్రీన్ ఫీల్డ్ హైవేను వదిలి రూట్ మార్చినా లాభం లేకపోయింది. సత్తుపల్లి పోలీసులు (Sathupally Police) వేసిన పక్కా స్కెచ్‌తో భారీ మొత్తంలో తరలిస్తున్న ఒడిశా గంజాయి ముఠా గుట్టు రట్టయింది. ఒడిశా నుండి హైదరాబాద్‌కు కారులో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 166 కేజీల 360 గ్రాముల గంజాయిని సత్తుపల్లి పోలీసులు చాకచక్యంగా స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారుగా రూ. 89,13,000 ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

​పోలీసుల దర్యాప్తులో నిందితుడు తప్పించుకోవడానికి వేసిన ప్లాన్ వెలుగుచూసింది. వృత్తిరీత్యా కారు డ్రైవర్ అయిన ఒడిశాకు చెందిన ప్రబిన్ భాత్రాతో, అక్కడి గంజాయి సరఫరాదారు బికారి అలియాస్ రోహన్ అనే వ్యక్తి ఒక డీల్ కుదుర్చుకున్నాడు. కారు డిక్కీలో 6 ప్లాస్టిక్ సంచులలో అమర్చిన 80 గంజాయి ప్యాకెట్లను హైదరాబాద్‌లో ఒక వ్యక్తికి అందిస్తే రూ. 10,000 ఇస్తానని ఆశ చూపాడు. దీంతో నిందితుడు టయోటా ఎటియోస్ కారులో దారకొండ జంక్షన్ నుండి బయలుదేరి రాజమండ్రి మీదుగా గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కాడు.

అయితే ముందు పోలీస్ తనిఖీలు ఉంటాయనే భయంతో వెంసూర్ వద్ద హైవే దిగి, సత్తుపల్లిలో భోజనం ముగించుకుని హైదరాబాద్ వెళ్దామని ప్లాన్ చేశాడు. కానీ, అప్పటికే కారు కదలికలపై ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సత్తుపల్లి పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. సత్తుపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ టి. శ్రీహరికి అందిన సమాచారంతో, ఏసీపీ వసుంధరా యాదవ్ పర్యవేక్షణలో ఈగల్ టీమ్, పోలీస్ సిబ్బంది సత్తుపల్లి పరిధిలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా వచ్చిన సదరు కారును ఆపి సోదా చేయగా గంజాయి రవాణా ఉదంతం బయటపడింది. దీంతో నిందితుడు ప్రబిన్ భాత్రాను పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుండి 166 కేజీల 360 గ్రాముల గంజాయితో పాటు టయోటా ఎటియోస్ కారు, ఒక సెల్ ఫోన్, రూ. 500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ భారీ గంజాయి రవాణాపై సత్తుపల్లి పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు ప్రబిన్ భాత్రాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, గంజాయి సరఫరా చేసిన ఒడిశాకు చెందిన బికారి అలియాస్ రోహన్, నంద్యాల జిల్లా బేతంచర్లకు చెందిన చుక్క నాగేశ్వరరావు గౌడ్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ టి. శ్రీహరి తెలిపారు. వీరి కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>