కలం, భువనగిరి : గ్రామాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా, బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామ శివారులో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ నిర్మాణ పనులకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbham Anil) శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం మాట్లాడుతూ.. గ్రామాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్మూలించడంతో పాటు, ప్రజలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమన్నారు. ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్, వేస్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ ద్వారా పర్యావరణానికి జరిగే మేలుతో పాటు గ్రామాల్లో పారిశుధ్యం మరింత మెరుగుపడుతుందని తెలిపారు.
ప్లాస్టిక్ రహిత గ్రామాల ఏర్పాటుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాల సక్రమ నిర్వహణ ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించడంతో పాటు, గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఈ యూనిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ శంకుస్థాపన మహోత్సవంలో బీబీనగర్ మండల, కొండమడుగు గ్రామ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

