కలం, ఖమ్మం బ్యూరో: ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు అధికారులు తీపి కబురు అందించారు. భద్రతా కారణాల దృష్ట్యా గత జూన్ చివరి వారంలో తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రసిద్ధ పాపికొండలు బోటింగ్ (Papikondalu Boating) విహారయాత్రకు అధికారులు మళ్లీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. బోట్ల ఫిట్నెస్, నదిలో నీటి మట్టం, పర్యాటకుల భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం నేటి నుంచే ఈ యాత్రను అధికారికంగా పునఃప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ విహారయాత్ర ఇవాళ్టి నుంచి అటు రాజమండ్రి పుష్కర ఘాట్ నుంచి, ఇటు భద్రాచలం నుంచి ఏకకాలంలో ప్రారంభం కానుంది. గోదావరి నది వెంబడి సాగే ఈ అద్భుతమైన జలవిహారంలో పాల్గొనే పర్యాటకుల కోసం నిర్వాహకులు ప్రత్యేక ప్యాకేజీ ధరలను ప్రకటించారు. ఇందులో భాగంగా పెద్దలకు రూ.1250, ఐదు నుంచి పది సంవత్సరాల లోపు పిల్లలకు రూ.1050 చొప్పున టికెట్ ధరలను ఖరారు చేశారు.
ఈ ఒక రోజు ప్యాకేజీ యాత్రలో పర్యాటకులు గోదావరి అందాలను వీక్షిస్తూ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలైన గండిపోచమ్మ ఆలయాన్ని, ప్రశాంత వాతావరణానికి నిలయమైన పేరంటాలపల్లి ఆశ్రమాన్ని సందర్శించవచ్చు. ఎత్తైన పాపికొండల మధ్య నుంచి సాగే బోటు ప్రయాణం పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా బోట్లలో లైఫ్ జాకెట్లు ధరించడం సహా అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్యాకేజీల బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం కావడంతో పర్యాటకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

