కలం, నిర్మల్: రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో ప్రతి అర్హత కలిగిన ఓటరు భాగస్వామి కావాలని బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) పిలుపునిచ్చారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేట్లోని తన నివాసంలో అర్బన్ తహసీల్దార్ రాజు ఎమ్మెల్యేకు ఎన్యూమరేషన్ ఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత ముందుకు వచ్చి ఓటరు నమోదు ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని, తమ కుటుంబ సభ్యులు, పరిచయస్తులకు కూడా ఈ విషయంపై అవగాహన కల్పించాలని కోరారు.

