కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాలు (Student Unions) డిమాండ్ చేశాయి. ఈ మేరకు జులై 10న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని శేషగిరి భవన్లో శుక్రవారం బంద్ సన్నాహక సమావేశం జరిగింది. విద్యార్థి సంఘాల నాయకులు వరక అజిత్, బుర్ర వీరభద్రం, మంద నాగకృష్ణ, దుర్గం ప్రణయ్ పాల్గొని మాట్లాడారు.
నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి..
రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేల క్లస్టర్ పాఠశాలలుగా కుదించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూ.7 వేల కోట్ల పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని కోరారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టడంతో పాటు, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం బలవంతపు అమ్మకాలను నిలిపివేయాలన్నారు. ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను తక్షణమే భర్తీ చేయాలన్నారు.
మౌలిక సదుపాయాలు కల్పించాలి..
నూతన జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకానికి సరిపడా నిధులు కేటాయించడంతో పాటు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, బ్రేక్ ఫాస్ట్ అందించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. బంద్‌ను విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

