Mobile Popup Ad
Mobile Popup Ad

సింగరేణిని రాజకీయ వేదికగా మార్చొద్దు: ఏఐటీయూసీ

కలం, కరీంనగర్ బ్యూరో : సింగరేణి (Singareni) సంస్థను రాజకీయ వేదికగా మార్చొద్దని, కార్మికుల చెమటను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించొద్దని ఏఐటీయూసీ (AITUC) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ (Korimi Rajkumar) అన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సింగరేణి బొగ్గు ఉత్పత్తి, గణాంకాలపై మాట్లాడాలనుకుంటే అందుకు సరైన వేదిక తెలంగాణ శాసనసభేనని పేర్కొన్నారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. గనుల వద్దకు వెళ్లి పదేపదే మీడియా సమావేశాలు నిర్వహించడం వల్ల సింగరేణి ప్రతిష్ఠ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం లేదా సింగరేణి యాజమాన్యం అధికారికంగా వివరణ ఇవ్వాల్సిన అంశాలను రాజకీయ వివాదాలుగా మార్చడం సరికాదని అన్నారు.

2017లో బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలో సుమారు 7.5 మిలియన్ టన్నుల అదనపు బొగ్గు ఉత్పత్తి చూపించారంటూ అప్పట్లో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దాసోజు శ్రావణ్ బహిరంగంగా విమర్శించారని గుర్తు చేశారు. అప్పట్లో స్పందించని వారు ఇప్పుడు నీతులు చెప్పడం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వం ఎవరిదైనా తప్పు జరిగితే ప్రశ్నించడం ఏఐటీయూసీ విధానమని స్పష్టం చేశారు. కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni) చేసిన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించడం దురుద్దేశపూరితమని కొరిమి రాజ్‌కుమార్ (Korimi Rajkumar) ఆరోపించారు. బొగ్గు దొంగతనం జరిగిందని ఆయన ఎక్కడా చెప్పలేదని, లక్ష్యానికి తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోయినా లెక్కల్లో తేడాలు చూపించడం కూడా తప్పేనని మాత్రమే వ్యాఖ్యానించారని తెలిపారు. కార్మికులలో అయోమయం రాకూడదనే ఉద్దేశంతోనే ఆయన మాట్లాడారని పేర్కొన్నారు.

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సంస్థ పేరును రాజకీయ ప్రచారానికి వాడుకోవడం వెంటనే ఆపాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. దాదాపు 70 వేల మంది శాశ్వత, కాంట్రాక్టు కార్మికుల భవిష్యత్తు కంటే రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వడం దురదృష్టకరమని పేర్కొంది. గనులలో అధికారులపై అనవసర ఒత్తిళ్లు తీసుకురావడం వల్ల కార్మికులు అభద్రతకు గురవుతారని హెచ్చరించింది. ఇప్పటికే అధిక రాజకీయ జోక్యం, అవినీతి కారణంగా సింగరేణి నష్టపోయిందని, ఇకపై సంస్థను రాజకీయాలకు అతీతంగా ఉంచి కార్మికుల హక్కులు, సింగరేణి ప్రతిష్ఠను కాపాడేందుకు ఏఐటీయూసీ పోరాటం కొనసాగిస్తుందని కొరిమి రాజ్‌కుమార్ స్పష్టం చేశారు.

Read Also: హాట్ టాపిక్.. తెలంగాణ బీజేపీలో ‘అవతార్ పురుష్’ సెగ..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>