కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కల్తీ ఫుడ్ ఘటనలు భారీ ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో పలు చోట్ల కుళ్లిన మాంసం, బూజు పట్టిన రొయ్యలు, చేపలు, కల్తీ పనీర్, అల్లం వంటి ఘటనలు అందరికీ తెలిసిందే. తాజాగా కరీంనగర్‌లోని మేఘా ఇండస్ట్రీస్ (Megha Industries)లో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో కల్తీ సోయా చంక్స్ లభ్యమవ్వడం కలకలం రేపుతోంది. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీస్ టాస్క్ ఫోర్స్‌తో కలిసి కరీంనగర్ జిల్లాలోని దేశ్‌రాజ్‌పల్లిలో ఉన్న మేఘా ఇండస్ట్రీస్‌లో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. అక్కడి పరిస్థితులు చూసి అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
మేఘా ఇండస్ట్రీస్‌లో (Megha Industries) తయారు చేస్తున్న సోయా చంక్స్‌లో భారీ ఎత్తున రఫ్ బ్రాన్‌ను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇది బియ్యం, గోధుమలు మిల్లింగ్ చేస్తున్నప్పుడు మిగిలే ఊకతో తయారు చేస్తారు. ఈ రఫ్ బ్రాన్ సంచులపై ఇవి మనుషులు వినియోగించేవి కాదని కూడా రాసి ఉంటుంది. దీనితోనే మేఘా సంస్థలో సోయా చంక్స్ తయారు చేస్తున్నారు. ఫ్యాక్టరీలో 33 బస్తాల్లో ఉన్న 1580 కిలోల రఫ్ బ్రాన్‌ను, 38 బస్తాల్లో ఉన్న 750 కిలోల కల్తీ సోయా చంక్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు.
ఈ రఫ్ బ్రాన్‌ను వరంగల్‌లోని శివతార గ్రెయిన్ మిల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో అధికారులు వరంగల్ చేరుకొని శివతార మిల్లింగ్‌లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ 49 కిలోల చొప్పున ఉన్న 211 బస్తాల రఫ్ బ్రాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి నమూనాలను కూడా పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. పెద్ద పెద్ద సంస్థల్లో కూడా ఇంత భారీ ఎత్తున కల్తీ జరగడం పట్ల అధికారులు విస్మయానికి గురవుతున్నారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన అనంతరం తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
Read Also: హాట్ టాపిక్.. తెలంగాణ బీజేపీలో ‘అవతార్ పురుష్’ సెగ..!
Follow Us On : WhatsApp

