కలం, వెబ్ డెస్క్ : వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లిలో జేఎస్డబ్ల్యూ రాయలసీయమ లిమిటెట్ నిర్మాణ పనులన ప్రారంభించిన సీఎం చంద్రబాబు (CM Chandrababu) వైసీపీ అధినేత జగన్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మతి స్థిమితం లేని వ్యక్తి రాజధానిపై పూటకో మాట మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. 2014లో అమరావతిగా రాజధానిని అంగీకరించిన వ్యక్తి.. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులన్నారని, 2024లో ఓడిపోయిన తర్వాత మావిగన్ స్లోగన్ తీసుకొని ఇప్పుడు విజయవాడ అంటున్నారని ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా జగన్ ఇలాకా నుంచి చెబుతున్నా.. అమరావతే మన రాజధాని అని సభలోని ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. మన రాజధాని అమరావతి అని అందరూ ఒప్పుకున్నారన్న సీఎం.. సదరు వ్యక్తి రాష్ట్ర ఆత్మాభిమానంతో ఆడుకోవడం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. కర్నాటక రాజధాని అంటే బెంగళూరు అనేవారు, తెలంగాణలో హైదరాబాద్ అంటారు.. తమిళనాడులో చెన్నై అంటారు, కానీ గత అధికార పార్టీ హయాంలో ఏపీకి మూడు రాజధానులతో నవ్వుకునే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు.
మరోవైపు సీమలో ఫ్యాక్షన్ పోయిందని .. ఇక సీమలో పారాల్సింది రక్తం కాదు, నీళ్లు అని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే ఫ్యాక్షన్ పోయింది కానీ నేరాలు చేసేవాళ్లు రాజకీయాల్లోకి వచ్చారని ఆరోపించారు. బాబాయ్ ని చంపి నారసుర రక్త చరిత్ర అని తనపై నిందలు వేశారని చెప్పారు. విధ్వంసమే అజెండాగా ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని పరోక్షంగా జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఏది ఏమైనా సీమతో పాటు అమరావతిని అందరూ గర్వపడేలా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

