కలం, వెబ్ డెస్క్ : వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న భర్తను కిరాతకంగా హత్య చేసి, శరీరాన్ని ముక్కలుగా నరికి గ్రైండర్‌లో రుబ్బిన ఘటన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో కలకలం రేపుతోంది. నాగరిక సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘోర హత్యకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) సంభల్ జిల్లా చందౌసి ప్రాంతానికి చెందిన రాహుల్ షూ వ్యాపారి. అతనికి రూబితో 15 ఏళ్ల క్రితం వివాహం కాగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే రూబికి గౌరవ్ అనే యువకుడితో ఉన్న వివాహేతర సంబంధం రాహుల్‌కు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భావించిన రూబి, ప్రియుడితో కలిసి భర్తను వదిలించుకోవాలని పథకం పన్నింది.
నవంబర్ 18న రూబి, గౌరవ్ కలిసి రాహుల్‌ను ఇనుప రాడ్, హామర్‌తో తలపై కొట్టి అతి దారుణంగా హత్య చేశారు. అనంతరం ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు రాహుల్ శరీరాన్ని ముక్కలుగా నరికి వుడ్ గ్రైండర్‌లో వేసి రుబ్బారు. తల, చేతులు, కాళ్లను వేరు చేసి కొన్ని భాగాలను పాలిథీన్ బ్యాగుల్లో ప్యాక్ చేసి సమీపంలోని డ్రెయిన్‌లో పారేయగా, మిగిలిన శరీర భాగాలను రాజ్‌ఘాట్ వద్ద గంగా నదిలో పడేశారు. ఈ ఘాతుకానికి పాల్పడిన తర్వాత ఏమీ తెలియనట్లుగా రూబి నవంబర్ 18నే పోలీసులకు తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది.
సుమారు నెల రోజుల తర్వాత డిసెంబర్ 15న ఈద్గాహ్ సమీపంలోని కాలువలో మానవ శరీర భాగాలు లభ్యమయ్యాయి. ఆ శరీర భాగంపై రాహుల్ అనే టాటూ ఉండటంతో మృతుడిని గుర్తించిన పోలీసులు, రూబిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాన్ని అంగీకరించింది. సంఘటనా స్థలం నుంచి హత్యకు వాడిన గ్రైండర్, ఇనుప రాడ్, స్కూటర్ వంటి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
Read Also: విద్యార్థిపై సీనియర్లతో దాడి చేయించిన ప్రిన్సిపల్
Follow Us On: Instagram


