ఊరు కదిలింది.. అడవి తిరిగొచ్చింది!

కలం, నిజామాబాద్ బ్యూరో: అడవిని మింగేస్తున్న భూమాఫియా.. చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. ‘అడవి మాది.. కాపాడాల్సిన బాధ్యత మీది’ అంటూ గళమెత్తి అధికార పీఠాలను కదిలించింది. చివరకు అధికారులను అడవి బాట పట్టేలా చేసి, 55 ఎకరాల ప్రకృతి సంపదను తిరిగి స్వాధీనం చేసుకునేలా చేసింది. నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని రావుట్ల గ్రామస్తులు చేసిన ఈ సంగ్రామం.. అడవిపై కన్నేసిన అక్రమార్కులకు గట్టి హెచ్చరికగా, ప్రజల ఐక్యతకు నిదర్శనంగా నిలవడమే కాకుండా నిద్రలో ఉన్న అధికార వ్యవస్థను తట్టిలేపింది.

ఒక చిన్న గ్రామం.. కానీ తీసుకున్న నిర్ణయం మాత్రం పెద్ద చరిత్రలా మారింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామస్తులు అటవీ భూమి ఆక్రమణపై ఒక్కటై నిలబడి అధికార యంత్రాంగాన్ని కదిలించారు. అటవీ భూములు అక్రమంగా చదును చేసి సాగు చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు మొదట అటవీ శాఖకు ఫిర్యాదు చేశారు. కానీ స్పందన ఆలస్యమవడంతో అసంతృప్తి పెరిగింది. చివరకు గ్రామమంతా కలిసి కలెక్టరేట్‌కు చేరింది. జూన్ 8న భారీ ధర్నా నిర్వహించింది.

హీటెక్కిన కలెక్టరేట్

కొన్నిగంటలపాటు కొనసాగిన ఈ ఆందోళనతో కలెక్టరేట్ ప్రాంగణం వేడెక్కింది. అక్కడికి వచ్చిన జేసీ, ఏసీపీలు, ఇతర అధికారులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ గ్రామస్తులు వినలేదు. కలెక్టర్ స్వయంగా రావాలని, హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి అప్పటి డీఎఫ్ఓ సిద్ధార్థ కలెక్టరేట్‌కు వచ్చి భూములను కాపాడతామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.

అటవీ శాఖ భారీ ఆపరేషన్

తాజాగా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలతో అటవీ శాఖ అధికారులు చర్యలకు దిగారు. ఆర్మూర్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ చంద్రశేఖర్ రావు, నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బలగాలు, జేసీబీలతో రావుట్ల సెక్షన్ అటవీ ప్రాంతానికి చేరుకుని ఆక్రమిత భూముల్లో ట్రెంచ్ (కందకాలు)పనులు ప్రారంభించారు. రెండురోజుల్లోనే (బుధ, గురువారం) సుమారు 55 ఎకరాల ఆక్రమిత అటవీ భూమిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ చర్యలు ఇంకా కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అటవీ భూముల్లో అక్రమంగా సాగు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

కుదిపేస్తున్న అటవీ ఆక్రమణలు

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో వేలాది ఎకరాల అటవీ భూమి ఇలాగే అన్యాక్రాంతమైంది. సిరికొండ, దర్పల్లి, ఇందల్వాయి, నిజామాబాద్ రూరల్, మోపాల్ మండలాల్లో పోడు సాగు పేరుతో గిరిజనేతరులు సైతం వందలాది ఎకరాలను కబ్జా చేస్తున్నారు. కొంతమంది అక్రమంగా పట్టాలు పొందగా, మిగిలిన అటవీ భూములపై కూడా కన్నేస్తున్నారు. ఈ భూములను కాపాడే క్రమంలో అటవీ సిబ్బందికి ప్రాణాపాయం పొంచి ఉంది. మోపాల్ మండలంలో సిబ్బందిపై దాడులు జరగగా, ఇందల్వాయి ఎఫ్‌ఆర్‌ఓ గంగయ్యను కబ్జాదారులు గొడ్డళ్లతో నరికి హత్య చేసిన ఘటన అటవీ శాఖ సిబ్బందిని ఇప్పటికీ భయపెడుతున్నది.

ఈ ఆపరేషన్ కొనసాగాలి..

రావుట్ల గ్రామస్తుల స్ఫూర్తితో ఇందల్వాయి (Indalwai) రేంజ్ పరిధిలోని సిర్నాపల్లి, ఉప్పలవాయి, కామారెడ్డి బాన్సువాడ రూట్లలోని ఆక్రమిత అటవీ భూములపై కూడా అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఆపరేషన్ ఇలాగే కొనసాగితేనే పచ్చని అడవిని కాపాడుకోగలమని ప్రకృతి ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>