కలం, నారాయణపేట: ప్రజా సభ జరిగిన ప్రదేశాన్ని ‘శుద్ధీకరణ’ పేరుతో బీజేపీకి చెందిన కొందరు సానుభూతిపరులు గంగజాలంతో శుభ్రం చేయడం కుల వివక్షకు సంబంధించిన ఆలోచనలకు తావిచ్చే చర్యగా కనిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ నారాయణపేట (Narayanpet Congress) జిల్లా అధ్యక్షులు కే ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. హల్ద్వానీలో జరిగిన కులవివక్ష ఘటనకు నిరసనగా ఏఐసీసీ, టీపీసీసీ కమిటీ పిలుపు మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు సత్యాగ్రహ మహాధర్నా నిర్వహించారు. సీవీఆర్ భవన్ నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించారు.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం అక్కడే సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు కె.ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy) మాట్లాడుతూ.. హల్ద్వానీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్న సభ అనంతరం జరిగిన ఘటన అత్యంత బాధాకరమన్నారు. రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా ఒక వ్యక్తి కులం ఆధారంగా అతని గౌరవాన్ని కించపరిచే చర్యలు జరగడం బాధాకరమన్నారు. అంటరానితనాన్ని రాజ్యాంగం నిషేధించినప్పటికీ ఇలాంటి ఘటనలు బీజేపీ పార్టీ ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు.
మల్లికార్జున్ ఖర్గేకి జరిగిన అవమానం ఒక్క వ్యక్తికి జరిగిన అవమానం కాదని, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ జరిగిన అవమానమని అన్నారు. ఈ ఘటనకు బీజేపీకి చెందిన కొందరు సానుభూతిపరుల ప్రమేయం ఉందని విమర్శించారు. బీజేపీ నాయకత్వం ఈ ఘటనను బహిరంగంగా ఖండించి, సమగ్ర విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. కుల వివక్షను ప్రోత్సహించే చర్యలకు ఎవరి మద్దతు ఉన్నా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఘటనకు బాధ్యులు ఎవరైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సత్యాగ్రహ దీక్షను జిల్లా కేంద్రానికే పరిమితం చేయకుండా ప్రతి మండలం, ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని.. ఈ ఘటనను ఖండించాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

