Mobile Popup Ad
Mobile Popup Ad

హాట్ టాపిక్.. తెలంగాణ బీజేపీలో ‘అవతార్ పురుష్’ సెగ..!

కలం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ (BJP Telangana )లో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అగ్ర నాయకత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. రాష్ట్రంలోని పార్టీ నేతల మధ్య కొనసాగుతున్న విభేదాలను సీరియస్ గా తీసుకున్న అగ్రనేతలు తీరు మార్చుకోకుంటే వేరే పార్టీలో నుంచి ‘అవతార్ పురుష్’ను రప్పించాల్సి ఉంటుందని తేల్చిచెప్తున్నారు. ఇటీవల మూడు రోజుల పర్యటన సందర్భంగా బీజేపీ నేషనల్ చీఫ్ నితిన్ నబిన్ కూడా అదే అంశాన్ని ప్రస్తావించినట్లు కమలం కేడర్ లో చర్చ జరుగుతున్నది. ఆ ‘అవతార్ పురుష్’ ఎవరనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఆ ఇద్దరి పర్యటనతో..!

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను గెల్చుకున్నామని బీజేపీలో సంతోషం ఉన్నా.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పవర్‌లోకి వస్తామనే నమ్మకం కొన్నాళ్లుగా లీడరల్లో సన్నగిల్లుతున్నది. పార్టీ విస్తరణకు అంతర్గతంగా లీడర్ల మధ్య ఉన్న గ్యాప్, ఆధిపత్య పోరు, వ్యక్తిగత ఎజెండా ఇబ్బందికరంగా మారాయి. దాదాపు ఏడాదిన్నరగా కొనసాగుతున్న ఈ విభేదాలు కంట్రోల్ కాకపోగా రోడ్డెక్కడం బీజేపీ అగ్ర నాయకత్వానికి చికాకుగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే “రెండేండ్లలో రెక్టిఫై చేసుకుంటే సరి. లేదంటే బయట పార్టీ నుంచి ఒక ‘అవతార్ పురుష్’ని తీసుకురావాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా చూసుకోండి” అంటూ తాజాగా నితిన్ నబిన్ కూడా చురకలంటించి వెళ్లినట్లు ప్రచారం జరుగుతున్నది.

అంతకు ముందు ఆర్ఎస్ఎస్ జాతీయ సహ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ సైతం రాష్ట్ర బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. “రాష్ట్రంలో పార్టీ పవర్‌లోకి రావాలని ఉందా?.. లేదా?.. మీ లైన్ ఏంటి?.. మీ ఎజెండా ఏంటి?..” అని ఆయన కూడా నిలదీసినట్లు తెలిసింది. అనవసరంగా ఆర్ఎస్ఎస్‌ను మీ గ్రూపు తగాదాల్లోకి లాగొద్దని హెచ్చరించినట్లు సమాచారం అందుతోంది.

ఒక్క పార్టీ.. నాలుగైదు గ్రూప్లు!

రాష్ట్ర బీజేపీలో ఉన్నది ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలే అయినా అందులో నాలుగైదు గ్రూపులు తయారుకావడం పార్టీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఒకే వేదికపై కలుసుకోలేనంత గ్యాప్ ఏర్పడింది. చివరికి రోడ్లమీద ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులు పెట్టుకుని విమర్శించేంత దాకా చేరుకున్నది. ఇక సోషల్ మీడియాలో విమర్శలు, దూషణలు సరేసరి. కేంద్ర, రాష్ట్ర సీనియర్ నేతలు ఎంత చెప్పినా మారలేదని గ్రహించిన బీజేపీ కొత్త చీఫ్ నితిన్ నబిన్ స్వయంగా రాష్ట్రంలోని పరిస్థితులను బేరీజు వేసుకోడానికి మూడు రోజుల పాటు పర్యటించారు.

రాష్ట్రంలో పార్టీ నిర్మాణం, విస్తరణకు చేసుకున్న ప్లానింగ్, లీడర్ల చొరవ, సహకారం… వీటన్నింటినీ నితిన్ నబిన్ పరిశీలించారు. నాయకుల మధ్య విభేదాలే పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకంగా మారాయని ఆయనకు అర్థమైంది. గ్రౌండ్ రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారు. ఎక్కడెక్కడ ఎలాంటి డ్రా బ్యాక్స్ ఉన్నాయో అవగాహన చేసుకున్నారు. ఆ తర్వాతనే ప్రాంత స్థాయి లీడర్లు, ఎంపీలు-ఎమ్మెల్యేలు-ఆశావహులు-పోటీచేసి ఓడిపోయినవారు, ఆఫీస్ బేరర్స్.. ఇలాంటి పలు స్థాయిల్లో విడివిడిగా ఇన్‌డోర్ మీటింగులు పెట్టి దిశానిర్దేశం చేశారు.

అమిత్ షా డైరెక్షన్లో నబిన్ టూర్!

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను తెలంగాణకు పంపించడంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చొరవ తీసుకొని రిపోర్ట్ తెప్పించుకున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. తెలంగాణలో ఎక్కడెక్కడ ముందున్నాం.. ఎక్కడెక్కడ వెనకబడ్డాం.. పార్టీ నేతల మధ్య సమన్వయం ఎలా ఉంది.. రాబోయే రెండేండ్లలో రోడ్ మ్యాప్ ఏంటి… వీటన్నింటిపై నితిన్ నబిన్ నుంచి అమిత్ షా వివరాలు సేకరించారని పొలిటికల్ స్కర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. దీంతో సీనియర్ లీడర్లు గ్రూపు రాజకీయాల పద్ధతి మార్చుకుని, వ్యక్తిగత ఎజెండాను పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేస్తే సరి.. లేదంటే కొత్త లీడర్లను తెచ్చుకోవడం.. లేదా తయారు చేసుకోవడం.. తప్పదనే అంచనాకు బీజేపీ జాతీయ నాయకత్వం వచ్చినట్లు తెలిసింది.

పర్యటనలో భాగంగా యూత్‌ను ఎట్రాక్ట్ చేయడం కోసం స్టూడెంట్స్ తో , జెన్-జీ యువకులతో నితిన్ నబిన్ భేటీ అయ్యారు. ‘మిషన్ తెలంగాణ’ టార్గెట్‌గా ఇక నుంచి స్టేట్ యూనిట్‌కు ఎప్పటికప్పుడు గైడెన్స్ అందనున్నదట. బీఆర్ఎస్‌ను కట్టడి చేయడంలో, వీక్ చేయడంలో స్టేట్ బీజేపీ అనుకున్న లక్ష్యాన్ని సాధించలేదనే అభిప్రాయం నితిన్ నబిన్ స్టేట్ టూర్ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ప్రత్యేక టాస్క్ తో వచ్చిన నితిన్ నబిన్.. రానున్న రోజుల్లో పార్టీలో కొన్ని మార్పులు చేసే చాన్స్ ఉంది.

ఆ ‘అవతార్ పురుష్’ ఎవరో?

వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల నుంచి లీడర్లను బీజేపీలో చేరడం, ఆ తర్వాత ఆ ప్రాంతీయ పార్టీలు వీక్ కావడం.. వంటివి కొన్నాళ్లుగా జరుగుతున్నాయి. ఇందుకు శివసేన, ఎన్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ.. లాంటివి కండ్ల ముందే ఉన్నాయి. తెలంగాణలో పవర్‌లోకి రావడానికి పార్టీ నేతలంతా శాయశక్తులా కృషి చేసి సక్సెస్ అయితే ఎలాంటి ఇబ్బందీ లేదని, కానీ అది జరగనప్పుడు బయట పార్టీ నుంచి ఒక పాపులర్ లీడర్ను ‘అవతార్ పురుష్’గా తీసుకురాక తప్పదని రాష్ట్ర బీజేపీ నేతలకు నితిన్ నబిన్ అంతర్గత సమావేశాల్లో ప్రస్తావించినట్లు బీజేపీ నేతలు డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ కామెంట్ల వెనక ఇప్పటికే ఆ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ జరుతున్నదన్న అనుమానం వ్యక్తమైంది. ఏ పార్టీ నుంచి ఆ అవతార్ పురుష్ ను లాగుతున్నారు?.. ఆ పాపులర్ లీడర్లు ఎవరు?.. అనే చర్చ అటు బీజేపీలో, ఇటు మిగిలిన పార్టీల్లోనూ మొదలైంది. ఈ చర్యతో బలమైన రాజకీయ ప్రత్యర్థిని వీక్ చేయడంతో పాటు బీజేపీకి బలం చేకూరుతుందందని… అతను రాష్ట్ర రాజకీయాలకే ‘ఫేస్‌’గా ఉంటారని బీజేపీ వ్యూహం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>