కలం, స్పోర్ట్స్: టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కీలక నిర్ణయం తీసుకున్నారు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL)లో డబ్లిన్ గార్డియన్స్ జట్టుకు సంబంధించిన క్రికెట్ వ్యవహారాలన్నింటినీ రవిచంద్రన్ అశ్విన్‌కే అప్పగించినట్లు వెల్లడైంది. 2026 ETPL ప్లేయర్ డ్రాఫ్ట్ అనంతరం మాట్లాడిన అశ్విన్, జట్టు ఎంపిక నుంచి మైదానంలో వ్యూహాల వరకు అన్ని నిర్ణయాలు తన ఆధ్వర్యంలోనే ఉంటాయని చెప్పారు. జట్టుకు సహ యజమానిగా ఉన్న ద్రవిడ్ మొదటి నుంచే క్రికెట్ నిర్ణయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.
డబ్లిన్ గార్డియన్స్ అశ్విన్‌ను కెప్టెన్‌తో పాటు మెంటర్‌గా కూడా నియమించింది. ఈ బాధ్యతను తనపై పూర్తి నమ్మకంతో ద్రవిడ్ (Rahul Dravid) అప్పగించారని అశ్విన్ తెలిపారు. జట్టును నిర్మించడం, సరైన కాంబినేషన్‌ను ఎంపిక చేయడం, వ్యూహాలు సిద్ధం చేయడం వంటి బాధ్యతలన్నీ తనవేనని చెప్పారు. కొత్త లీగ్‌లో పనిచేయడం అందరికీ కొత్త అనుభవమేనని అశ్విన్ అన్నారు. అయితే ETPLను బలమైన టోర్నీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తాను, ద్రవిడ్ కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ టోర్నీలో తమ ముద్ర తప్పకుండా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
కెప్టెన్‌తో పాటు మెంటర్ బాధ్యతలను స్వీకరించడం తన కెరీర్లో సహజమైన ముందడుగేనని అశ్విన్ చెప్పారు. గత కొన్నేళ్లుగా దేశీయ క్రికెట్లో కూడా ఇలాంటి పాత్రలు పోషించానని, అందుకే ద్రవిడ్ తనపై విశ్వాసం ఉంచారని వివరించారు. మోకాలి శస్త్రచికిత్స తర్వాత ETPL ద్వారానే మళ్లీ పోటీ క్రికెట్లోకి రాబోతున్నట్లు అశ్విన్ తెలిపారు. టోర్నీ ప్రారంభమయ్యే సమయానికి పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉంటానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

