Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం పర్యటన.. అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు: కలెక్టర్, ఎస్పీ

కలం, నాగర్ కర్నూల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4వ తేదీన నాగర్ కర్నూల్ జిల్లా ఉరుకొండ మండల పరిధిలోని ఉరుకొండపేట ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌తో కలిసి ఉరుకొండపేటలోని ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించి జరుగుతున్న ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న నూతన హెలిప్యాడ్ నిర్మాణ పనులను కలెక్టర్, ఎస్పీ అధికారులతో కలిసి పరిశీలించి సంబంధిత శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు.

హెలిప్యాడ్ నుంచి ఆలయానికి ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గం, భద్రతా ఏర్పాట్లు, ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం ఆలయ ఈవో, అర్చకులతో సమావేశమైన కలెక్టర్, ముఖ్యమంత్రి నిర్వహించే ప్రత్యేక పూజలు, ప్రదక్షిణలు, పూర్ణకుంభ స్వాగతం, దర్శన ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించారు. ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

దేవాలయ దర్శనం అనంతరం ముఖ్యమంత్రి ఆలయ వెలుపల ఏర్పాటు చేసిన ప్రాంగణంలో కొంతమంది ప్రముఖులతో కలిసి మధ్యాహ్న భోజనంలో పాల్గొననున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లను కూడా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. అతిథులకు అవసరమైన సౌకర్యాలు, భద్రత, పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి..

ఈ సందర్భంగా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అన్ని అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని, ప్రతి శాఖ తమకు అప్పగించిన బాధ్యతలను సమన్వయంతో నిర్వర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఉరుకొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి శాఖలవారీగా అప్పగించిన బాధ్యతలను మరోసారి సమీక్షించి అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదని పేర్కొన్న కలెక్టర్, ఏ ఒక్క అధికారి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని స్పష్టం చేశారు. అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

హెలిప్యాడ్ నుంచి ఆలయానికి చేరుకోవడం, దర్శనం అనంతరం ప్రముఖులతో భోజన కార్యక్రమం వరకు ప్రతి దశలో వివిధ శాఖల అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, రవాణా, వైద్య సేవలు, అగ్నిమాపక ఏర్పాట్లు, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా వీఐపీల పార్కింగ్ ప్రాంతాలు, ప్రధాన రహదారుల వెంట పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, పచ్చదనం పెంపొందించేలా మొక్కలు నాటాలని, పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సంబంధిత శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

విత్తనాలు, యూరియాపై ముందస్తు చర్యలు చేపట్టాలి..

అదేవిధంగా ప్రస్తుతం సాగు సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో మండల పరిధిలో రైతులకు విత్తనాలు, యూరియా కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతులకు అవసరమైన వ్యవసాయ ఇన్‌పుట్లు సకాలంలో అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయడంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ప్రతి చిన్న అంశాన్ని కూడా అత్యంత ప్రాధాన్యంతో పరిగణించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దేవ సహాయం, అరుణ రెడ్డి, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి డీఎస్పీ, ఆలయ ఈవో సత్య చంద్రా రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>