కలం, వెబ్ డెస్క్: మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వీబీ-జీ-రామ్ జీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం అమలు చేయాలా.. వద్దా.. అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భేటీ అయిన రాష్ట్ర మంత్రి వర్గం సుదీర్ఘంగా చర్చ చేసింది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలను కనీసం సంప్రదించకుండా కేంద్రం తెచ్చిన ఈ చట్టంలో ఉన్న వివాదాస్పద నిబంధనలపై మంత్రివర్గం తీవ్ర నిరసన తెలిపింది.
గత్యంతరం లేని పరిస్థితుల్లోనే..
ఉపాధి హామీ పథకంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయవద్దని జనవరి నెలలోనే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయాన్ని కేబినెట్ గుర్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆర్థిక భారం మోపేలా రూపొందించిన కొత్త చట్టం.. ఫెడరల్, రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధంగా ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇచ్చినట్లు వివరించింది.
ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయా.. లేదా.. అని అక్కడే ఉన్న అధికారులను మంత్రి వర్గం అడిగి తెలుసుకుంది. నేటి నుంచే అమలు చేస్తున్నాయని చెప్పడంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే కొత్త చట్టాన్ని తెలంగాణలో కూడా అమల్లోకి తేవాలని అంగీకరించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం..
విధి లేని పరిస్థితుల్లోనే రాష్ట్రంలో వీబీ-జీ-రామ్ జీ చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపిన కేబినెట్.. న్యాయ పోరాటం కొనసాగించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. కొత్త చట్టంలో విధించిన నిబంధనలు రాష్ట్రాలపై తీవ్ర ఆర్థిక భారం మోపేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించింది. అలాగే, పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని భావించింది.

