Mobile Popup Ad
Mobile Popup Ad

ఐపీఎల్ తరహాలో యూరప్ భారీ ప్లాన్.. జాంటీ రోడ్స్

కలం, స్పోర్ట్స్: ఐపీఎల్ తరహాలో యూరప్‌లోనూ క్రికెట్‌కు కొత్త ఊపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ (Jonty Rhodes) వెల్లడించారు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్ (ETPL) ఉద్దేశం కేవలం ట్రోఫీ గెలవడం కాదని, యూరప్‌లో కొత్త క్రికెటర్లను తయారు చేయడమే అసలు లక్ష్యమని చెప్పారు. 2026 ప్లేయర్ డ్రాఫ్ట్ ముగిసిన తర్వాత మాట్లాడిన రోడ్స్.. రోటర్‌డామ్ జట్టు తొలి ఎంపికగా ఐర్లాండ్ యువ ఆటగాడు జై మూంద్రాను ఎంపిక చేసిన విషయాన్ని ప్రస్తావించారు. యూరప్ నుంచి భవిష్యత్తులో ఐపీఎల్, బిగ్ బాష్, ఎస్‌ఏ20 వంటి లీగ్‌ల్లో రాణించే ఆటగాళ్లు రావడానికి ETPL బలమైన వేదికగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

2009 నుంచి ఐపీఎల్‌ను దగ్గరగా చూసిన అనుభవం తనకు ఉందని చెప్పారు. తర్వాత ఎస్‌ఏ20 ఎలా విజయవంతమైందో కూడా చూశానన్నారు. ఈ తరహా ఫ్రాంచైజీ లీగ్‌లు కేవలం స్టార్ ఆటగాళ్లను మాత్రమే కాదు, గ్రామీణ స్థాయి నుంచి కొత్త ప్రతిభను వెలికితీయడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. దక్షిణాఫ్రికాలో ఒక దశలో రగ్బీ కారణంగా క్రికెట్ ఆదరణ తగ్గిందని, కానీ ఎస్‌ఏ20 ప్రారంభమైన తర్వాత మళ్లీ అభిమానుల్లో క్రికెట్‌పై ఆసక్తి పెరిగిందని గుర్తుచేశారు.

స్వీడన్ జట్టుకు కోచ్‌గా పనిచేసిన సమయంలో యూరప్‌లో క్రికెట్‌పై ప్రజల్లో ఉన్న ఆసక్తిని దగ్గరగా గమనించానని రోడ్స్ తెలిపారు. ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్‌కే కాకుండా ఐసీసీకి చెందిన 30కి పైగా యూరప్ దేశాల్లో క్రికెట్‌కు మంచి ఆదరణ ఉందన్నారు. అందుకే ETPL లక్ష్యం ఒక ఛాంపియన్ జట్టును తయారు చేయడం మాత్రమే కాదని, యూరప్‌లో క్రికెట్‌ను అడుగడుగునా బలోపేతం చేసి, భవిష్యత్తు తరాలకు బలమైన పునాది వేయడమేనని జాంటీ రోడ్స్ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>