కలం, వెబ్ డెస్క్: రాష్ట్ర అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు. నిన్న రూ.8 లక్షల కోట్లు అన్న మంత్రి, ఈ రోజు మాట మార్చి రూ.7 లక్షల కోట్లు అని చెబుతున్నారని మండిపడ్డారు. ఒకవేళ ఈ రోజు చర్చ జరిగి ఉంటే.. రూ.3 లక్షల కోట్లకు తగ్గించి ఉండేవారేమో అని ఎద్దేవా చేశారు. రూ.8 లక్షల కోట్లు చేసినట్లు నిరూపించకపోతే రాజీనామా చేస్తానని జూపల్లినే అన్నారని.. వెంటనే తప్పుకోవాలని సూచించారు.
చర్చకు సిద్ధమని.. అరెస్ట్ చేయిస్తారా..?
గురుకుల విద్యాసంస్థల్లో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని హరీష్ రావు మరోసారి ఆరోపించారు. దీనిపై చర్చకు సిద్ధమని మంత్రులు చాలా సార్లు చెప్పారని గుర్తు చేశారు. తాము కూడా అంగీకరించి, సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో సమయం కూడా చెప్పినా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రవీణ్ కుమార్ వస్తే తాము రాలేమని, హరీష్ గన్ పార్క్ వద్దకు రావాలని మంత్రులే సవాల్ చేశారన్నారు.
దీంతో తాను సిద్దిపేట పర్యటన విరమించుకుని, మంత్రులు ఉన్న గన్ పార్క్ వద్దకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. అలాంటప్పుడు పోలీసులతో ఎందుకు అరెస్ట్ చేయించారని ప్రశ్నించారు. ముగ్గురు మంత్రులకు ఫోన్లు చేస్తే స్పందించలేదని విమర్శించారు. టెండర్లలో అవినీతి జరిగినందునే తాము చర్చకు రాకుండా అడ్డుకున్నారని స్పష్టం చేశారు.

