కలం, వెబ్ డెస్క్ : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. బెంగళూరులోని ఇస్రో కార్యాలయానికి గురువారం బాంబు బెదిరింపు ఈ – మెయిల్ రావడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి.నారాయణన్ కార్యాలయానికి ఈ బెదిరింపు ఈ-మెయిల్ రావడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన ఇస్రో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.
ఈ సమాచారం అందిన వెంటనే, బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో పాటు పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని కార్యాలయంలో ఉన్న సిబ్బందిని ఖాళీ చేయించారు. అనంతరం ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ-మెయిల్ పంపిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ-మెయిల్ విదేశాల నుండి వచ్చిందా అనే విషయాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

