కలం, భువనగిరి: సింగన్నగూడెం వద్ద ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల మౌలిక సదుపాయాలపై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbam) రివ్యూ నిర్వహించారు. గురువారం సంబంధిత శాఖల అధికారులతో తన క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇళ్ల పంపిణీ, కాలనీలో కల్పించాల్సిన మౌలిక వసతుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇప్పటికే కేటాయించిన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులను అత్యవసరంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కాలనీలో నివాసం ఉండబోయే పేదలకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అందుకోసం కాలనీలో నిరంతర తాగునీటి సరఫరా, విద్యుద్దీకరణ, వీధి దీపాల ఏర్పాటు, అంతర్గత సీసీ రహదారులు, పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. పనుల పూర్తికి అవసరమైన అదనపు నిధులను సమకూర్చి, అనుకున్న సమయంలోగా ఇళ్లను లబ్ధిదారులకు నివాసయోగ్యంగా అందించాలని స్పష్టం చేశారు.
“పనుల అమలులో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కడా అలసత్వం వహించకూడదు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలి. సింగన్నగూడెం డబుల్ బెడ్‌రూమ్ కాలనీని పూర్తిస్థాయిలో మోడల్ కాలనీగా తీర్చిదిద్దాలి.” అని పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాశ్ రెడ్డి, భువనగిరి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్రీరేఖ-బాబురావు, మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి-రవికుమార్, వైస్ చైర్‌పర్సన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కూర వెంకటేశ్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, పంచాయతీ రాజ్, మున్సిపల్, హౌసింగ్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

