కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రాజకీయ జన్మనిచ్చిన నేలకు సీఎం రేవంత్ (CM Revanth) రాక ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మిడ్జిల్‌లో రేవంత్ రెడ్డి 20 ఏళ్ల పండగను జరుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్వం సిద్ధం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై 4, 2026న మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్ మండలానికి విచ్చేస్తున్నారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం (2006లో) ఇదే రోజున మిడ్జిల్ జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అదే గడ్డపై అడుగుపెడుతుండటం చారిత్రక విశేషం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అక్కడ భారీ ‘కృతజ్ఞత సభ’ నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
మొదటిసారి సీఎం హోదాలో మిడ్జిలకు రాక
వంద అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. అన్నట్లుగా, రేవంత్ రెడ్డి అనే సామాన్య యువకుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన ప్రస్థానానికి మిడ్జిల్ వేదికైంది. తనను తొలిసారి ఆదరించి, రాజకీయ జన్మనిచ్చిన ఆ నేల రుణం తీర్చుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ‘కృతజ్ఞత సభ’ ద్వారా ప్రజల ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన కేవలం ఒక రాజకీయ సభలా కాకుండా, భావోద్వేగాల సమ్మేళనంగా సాగనుంది.
మొదటగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచిన, తన ఇష్టదైవమైన ఆంజనేయ స్వామిని ఊరుకొండ లోదర్శనం చేసుకోని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 2006లో తన తొలి గెలుపునకు సహకరించిన నాటి మిత్రులు, అనుచరులు, సీనియర్ నాయకులతో కలిసి సీఎం మధ్యాహ్న భోజనం (ఆత్మీయ విందు) చేస్తారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి ఇది ప్రత్యేక వేదిక కానుంది.
విగ్రహాలను ఆవిష్కరించనున్న సీఎం..
అనంతరం మిడ్జిల్ సమీపంలో దివంగత నేత ధ్యాప గోపాల్ రెడ్డి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలను సీఎం ఆవిష్కరిస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జడ్పీటీసీ టు సీఎం వరకు రేవంత్ రెడ్డిది ఒక అద్భుత ప్రయాణం. రేవంత్ రెడ్డి (CM Revanth) రాజకీయ జీవితంలో జూలై 4వ తేదీకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. 2006 స్వతంత్ర అభ్యర్థిగా మిడ్జిల్ జడ్పీటీసీగా ఆయన విజయం సాధించారు. ఇదే ఆయన రాజకీయ జీవితానికి పునాది అయింది.
ఆ తర్వాత ఎమ్మెల్సీగా, గెలుపొంది టీడీపీలో రేవంత్ రెడ్డి చేరిపోయారు. కొడంగల్ (Kodangal) ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ లో చేరి మల్కాజిగిరి ఎంపీగా గెలుపొంది, టీపీసీసీ పగ్గాలు చేపట్టి నేడు ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నారు. “మీ బిడ్డను.. మళ్లీ వస్తున్నా. మీ ఆశీర్వాదం వల్లే రాష్ట్రానికి సేవ చేసే అవకాశం వచ్చింది” అనే భావనతో సీఎం ఈ పర్యటనను చేపడుతున్నారు. మిడ్జిల్ ప్రజలు తమ నేతను స్వాగతించడానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటన రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలోనే ఒక భావోద్వేగ ఘట్టంగా నిలిచిపోనుంది.
Read Also: తెలంగాణ – కర్నాటక.. బోర్డర్‌లో ‘చెత్త’ పంచాయితీ!
Follow Us On : WhatsApp

