కలం, వెబ్ డెస్క్: ఏపీలోని మన్యం జిల్లాల్లో కనీస వసతులు లేక మన్యంవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు, తాగునీరు, వైద్యం లాంటి సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో అందరి మనసులను కదిలిస్తోంది. మన్యం జిల్లా పార్వతీపురం (Parvathipuram) పరిధిలోని గుమ్మలక్ష్మీపురం ఆశ్రమ పాఠశాల వార్డెన్ హేమ మానవత్వాన్ని చాటుకున్నారు. పాఠశాలలో చదువుతున్న భువనేశ్వరి అనే చిన్నారి జ్వరంతో బాధపడుతుండటాన్ని గమనించింది.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించారు. ఆస్పత్రికి వెళ్లేందుకు ఆ ప్రాంతంలో సరైన రోడ్లు లేవు. దీంతో పాపను తన భుజాలపై ఎక్కించుకున్నారు. రాళ్లు, రప్పలతో కూడిన కష్టమైన కొండ మార్గంలో ఏకంగా 6 కిలోమీటర్ల మేర నడిచింది. పిల్లను సురక్షితంగా ఆసుపత్రికి చేర్చి సకాలంలో వైద్యం అందేలా చూశారు. ఒక తల్లిలా ఆ విద్యార్థినిని ఆదుకున్నారు. బాలిక పట్ల హేమ కనబర్చిన ప్రేమను నెటిజన్స్ అభినందిస్తున్నారు.

