Mobile Popup Ad
Mobile Popup Ad

ఒకటికి నాలుగు రెట్లు ఇస్తామన్నారు.. తీరా చూస్తే సీన్ రివర్స్!

కలం, ఖమ్మం బ్యూరో : బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి ఒకటికి నాలుగు రెట్లు ఇస్తామంటూ అమాయకులను నమ్మించి, నకిలీ, అసలు పోలీసులతో దాడులు చేయిస్తూ దోపిడీలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర డెకాయిటీ ముఠాను ఖమ్మం జిల్లా సత్తుపల్లి (Sathupally) పోలీసులు పట్టుకున్నారు. కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన బాధితుడు కుర్రా గంగాధర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూన్ 25న సత్తుపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ నేతృత్వంలో ఏర్పడిన ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి, సత్తుపల్లి ఇన్‌స్పెక్టర్ టి. శ్రీహరి ఆధ్వర్యంలో నిన్న ఉదయం గంగారంలోని ఘటనా స్థలంలో 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో నిందితులు తాము చేసిన డెకాయిటీ నేరాన్ని అంగీకరించారు. ​ఈ ముఠా వేర్వేరు నకిలీ సిమ్‌ల ద్వారా అమాయకులకు ఫోన్ చేసి, తాము పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులమని, తమ వద్ద రూ.2 కోట్ల బ్లాక్ మనీ ఉందని నమ్మించేవారు. ఎవరైనా రూ.10 లక్షల ఒరిజినల్ నగదు ఇస్తే, అందుకు బదులుగా వారి అకౌంట్లలో రూ.40 లక్షలు వేస్తామని ఆశ చూపి, వారు చెప్పిన చోటుకు రప్పించేవారు. బాధితులు డబ్బుతో రాగానే, తమ ముఠా మనిషి ద్వారా డమ్మీ చిల్డ్రన్ కరెన్సీ నోట్లు ఉన్న బ్యాగును పంపి, ఆ డబ్బును లెక్కబెట్టే సమయంలో ముందే ప్లాన్ చేసుకున్న నకిలీ, అసలు పోలీసులు కార్లలో అక్కడికి చేరుకునేవారు. బాధితులను దొంగనోట్ల వ్యాపారులని, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అని బెదిరించి, అనుమానం రాకుండా ఉండేందుకు తమ ముఠా మనిషిని కూడా కొడుతూ బాధితుల వద్ద ఉన్న ఒరిజినల్ నగదును లాక్కొని పారిపోయేవారని విచారణలో తేలింది.

​ఈ కేసులో పోలీసులు ఏ-1 నుండి ఏ-12 వరకు ఉన్న నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, సిమ్ కార్డులు అందించిన ఏ-13, ఏ-14 నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అరెస్ట్ అయిన వారిలో ఏ-2 ముళ్ళగిరి వర్ధన్ (TGSP కానిస్టేబుల్), ఏ-4 బేరా కేశవరావు (RSI-TGSP 15వ బెటాలియన్)లు కూడా ఉండటం గమనార్హం. నిందితుల నుంచి రూ.17,60,000 నగదు, 2 ఇన్నోవా కార్లు, 1 ఎర్టిగా కార్, 1 స్కూటీ, 16 సెల్‌ఫోన్లు, చేతిసంకెళ్లు, వివిధ పోలీస్ యూనిఫామ్‌లు, రూ.500 ల 80 బండిళ్ల డమ్మీ చిల్డ్రన్ కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించగా, ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>