కలం, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station)లో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్‌నకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కిడ్నాప్ జరిగి 11 రోజులు గడుస్తున్నా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో మునిగిపోయారు. ఉప్పల్ చిలకనగర్ ప్రాంతానికి చెందిన రాపు రాజేశ్వరి అనే మహిళ తన ఐదేళ్ల కుమారుడు నిఖిల్, తల్లి స్వరూపతో కలిసి నివసిస్తోంది. గత నెల జూన్ 20వ తేదీన కుటుంబంలో తలెత్తిన కొన్ని కలహాల కారణంగా మనవడు నిఖిల్‌ను తీసుకుని స్వరూప సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది.
అక్కడ ప్లాట్‌ఫామ్ నంబర్ 1పై ఆమె విశ్రాంతి తీసుకుంటుండగా, నిఖిల్ మాయమయ్యాడు. చుట్టుపక్కల వెతికినా బాలుడు కనిపించకపోవడంతో భయాందోళనకు గురైన స్వరూప, తిరిగి ఇంటికి వచ్చి తన కూతురు రాజేశ్వరికి విషయం చెప్పింది. దీంతో జూన్ 21వ తేదీన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆ బాలుడిని తీసుకువెళ్లినట్లు స్పష్టమైంది. అయితే, కిడ్నాప్ జరిగి ఇన్ని రోజులవుతున్నా నిఖిల్ జాడ కనిపెట్టలేకపోవడంపై కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

