కలం, ఖమ్మం బ్యూరో: కేజీ మాంసం కొంటే అందులో కోత పడాల్సిందే.. డిజిటల్ మీటర్ చూపించే బరువు ఒకటి, చేతికి వచ్చే కొలత మరొకటి! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palvancha) పట్టణంలోని చికెన్, చేపల విక్రయ కేంద్రాల్లో కేజీకి తక్కువ తూకాలతో వినియోగదారులను నిలువునా ముంచుతున్న వ్యాపారుల గుట్టును తూనికలు, కొలతల శాఖ అధికారులు ఆదివారం రట్టు చేశారు.
కొద్దిరోజులుగా వస్తున్న ఫిర్యాదులతో రంగంలోకి దిగిన అధికారులు పట్టణంలోని పలు వ్యాపార కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించి కొరడా ఝళిపించారు. ఈ దాడుల సందర్భంగా దుకాణాల్లో వినియోగిస్తున్న ఎలక్ట్రానిక్ కాంటాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. కొందరు వ్యాపారులు డిజిటల్ రీడింగ్‌లో మార్పులు చేశారు. వినియోగదారుల కంటికి తెలియకుండా తక్కువ తూకాలు వేస్తూ అక్రమ అర్జనకు పాల్పడుతున్నట్లు ఆధారాలతో సహా నిరూపితమైంది. దీంతో నిబంధనలు ఉల్లంఘించి సీలింగ్ లేని కాటాలు వాడుతున్న, తక్కువ తూకాలతో మోసానికి పాల్పడుతున్న వ్యాపారులపై అధికారులు తూనికలు-కొలతల చట్టం కింద కేసులు నమోదు చేసి అక్కడికక్కడే జరిమానాలు విధించారు.
వినియోగదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకుంటే ఇకపై సహించేది లేదని అధికారులు తీవ్రంగా హెచ్చరించారు. పునరావృతమైతే సీజ్ చేయడంతోపాటు షాపు లైసెన్సులు కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి వినియోగదారుడు సరుకులు కొనేటప్పుడు కాటా రీడింగ్‌ను జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. తూకాల్లో ఏమాత్రం తేడాలు ఉన్నట్లు అనుమానం వచ్చినా వెంటనే తమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు.

