కలం, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ (Amethi) జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున దట్టమైన పొగ మంచు (fog) కారణంగా లక్నో-వారణాసి జాతీయ రహదారిపై భారీ ప్రమాదం జరిగింది. పొగ మంచు వల్ల ఢీకొన్న ఆరు వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. సర్కిల్ ఆఫీసర్ అతుల్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. దట్టమైన పొగ మంచు(fog) కారణంగా మొదటి ఒక ట్రక్ డివైడర్‌పైకి ఎక్కింది. వెనుక నుంచి వచ్చిన మరో ట్రక్ దాన్ని ఢీకొన్నది. ఆ తర్వాత మరో రెండు ట్రక్కులు, హర్దోయ్ డిపోకు చెందిన బస్సు, ఒక కారు కూడా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ఇద్దరు ట్రక్ డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. జనరథ్ బస్సులో ప్రయాణిస్తున్న 16 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కారులో ప్రయాణిస్తున్న దంపతులు తృటిలో తప్పించుకున్నారు. ప్రమాదం కారణంగా హైవేపై ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జ్ఞానేంద్ర సింగ్, సర్కిల్ ఆఫీసర్ అతుల్ సింగ్, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ అభినవ్ కనౌజియా, తహసీల్దార్ రాహుల్ సింగ్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్రేన్లు, జేసీబీ మెషీన్లతో శిథిలాలను తొలగించారు. గాయపడిన వారిని ముసాఫిర్‌ఖానా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. తీవ్ర గాయాలతో ఉన్న వారిని సుల్తాన్‌పూర్ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు.


